కొత్త తెలుగు మంత్రుల్లారా.. ప్లీజ్‌!

మూడో సారి ప్ర‌ధానిగా మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌తంలో బీజేపీ స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల‌ను సంపాదించుకుంది. ఈ ద‌ఫా అంత సీన్ లేద‌ని ప్ర‌జ‌లు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మిత్ర‌ప‌క్షాల‌తో…

మూడో సారి ప్ర‌ధానిగా మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌తంలో బీజేపీ స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల‌ను సంపాదించుకుంది. ఈ ద‌ఫా అంత సీన్ లేద‌ని ప్ర‌జ‌లు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

తెలంగాణ‌లో బీజేపీ నుంచి ఇద్ద‌రు, ఏపీ విష‌యానికి వ‌స్తే ఒక‌రు మోదీ కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. వీరు కాకుండా మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నుంచి ఇద్ద‌రు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరికి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా వీరికి శుభాకాంక్ష‌లు చెబుతూనే, ఏం సాధించాలో కూడా ఆయ‌న దిశానిర్దేశం చేయ‌డం విశేషం.

“తెలుగురాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన  జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను” అంటూ రేవంత్‌రెడ్డి క‌ర్త‌వ్య బోధ‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

మోదీ స‌ర్కార్ మూడోసారి కేంద్రంలో కొలువుదీరిన‌ప్ప‌టికీ, గ‌త ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌కు ఏమీ చేయ‌లేద‌నే విమ‌ర్శ వుంది. విభ‌జ‌న హామీల‌ను మోదీ స‌ర్కార్ అమ‌లు చేయ‌లేద‌ని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు అంగీక‌రించే విష‌యం. అయిన‌ప్ప‌టికీ వాటిని నెర‌వేర్చాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు మోదీ స‌ర్కార్‌పై ఒత్తిడి చేసిన పార్టీలు …మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లేవంటే అతిశ‌యోక్తి కాదు.

ఏపీలోని రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ బీజేపీకి దాసోహ‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు బాధ్య‌త‌లున్నారు. ఇప్పుడైనా ఏపీకి రావాల్సిన‌వి సాధిస్తార‌ని ఆశిద్దాం.