సమ్మర్ బాక్సాఫీస్.. మరో నెల వృధా

గతేడాది మే నెలలో ఒక్క స్ట్రయిట్ హిట్ లేదు. కానీ డబ్బింగ్ సినిమాలు మెరిశాయి. ఈ ఏడాది మే నెలలో అది కూడా లేదు. ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా చూడలేదు బాక్సాఫీస్. Advertisement…

గతేడాది మే నెలలో ఒక్క స్ట్రయిట్ హిట్ లేదు. కానీ డబ్బింగ్ సినిమాలు మెరిశాయి. ఈ ఏడాది మే నెలలో అది కూడా లేదు. ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా చూడలేదు బాక్సాఫీస్.

ఈ సమ్మర్ వృధా అయిపోతోందంటూ ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. స్టార్ హీరోలు ఎవ్వరూ మే నెలలో సందడి చేయలేదు. వస్తాడనుకున్న ప్రభాస్ కూడా రాలేదు. దీంతో మే నెల బాక్సాఫీస్ బోసిపోయింది.

మే నెలలో అటుఇటుగా 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి వారంలో ఆ ఒక్కటి అడక్కు, బాక్ లాంటి సినిమాలపై కూసింత అంచనాలుండేవి. కానీ ఆశలు నెరవేరలేదు. అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఆ ఒక్కటి అడక్కు, నవ్వులు పూయించలేకపోయింది. ఇక తమన్న, రాశిఖన్నా కలిసి చేసిన బాక్ తేలిపోయింది.

ఇక ప్రసన్న వదనం, శబరి లాంటి సినిమాల్ని థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అటు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చినప్పటికీ.. 4-5 స్క్రీన్స్ కు మాత్రమే దీని హంగామా పరిమితమైంది.

రెండో వారంలో.. ప్రతినిధి2, కృష్ణమ్మ లాంటి సినిమాలొచ్చాయి. హిట్ కోసం అర్రులుచాస్తున్న నారా రోహిత్, సత్యదేవ్ కు ఈ రెండు సినిమాలు బొత్తిగా కలిసిరాలేదు. ఈ సినిమాలతో పాటు వచ్చిన బ్రహ్మచారి, లక్ష్మీకటాక్షం, ఆరంభం లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

మూడో వారంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మిరల్, దర్శిని, నటరత్నాలు.. ఇలా దాదాపు 5 సినిమాలు వచ్చినవి వచ్చినట్టే వెళ్లిపోయాయి. అపరిచితుడు రీ-రిలీజ్ కూడా ప్రభావం చూపించలేకపోయింది.

నాలుగో వారంలో దిల్ రాజు సపోర్ట్ తో వచ్చిన లవ్ మీ సినిమా గ్రాండ్ గా రిలీజైంది. అయితే తన ఫ్యామిలీ హీరో ఆశిష్ కు హిట్టివ్వలేకపోయాడు రాజు. సినిమా వాయిదాలు పడడం, ఆఖరి నిమిషంలో మళ్లీ షూటింగ్ చేయడం, ప్రచారానికి తగినంత టైమ్ లేకపోవడం, ప్రమోషన్స్ లో కొత్తదనం లేకపోవడం, అన్నింటికీ మించి కంటెంట్ లో లోపాలు లవ్ మీ సినిమాను ప్రేక్షకులకు దూరం చేశాయి. ఇదే వారంలో వచ్చిన రాజు యాదవ్, సీడీ, సిల్క్ శారీ లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

మే నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హిట్ లిస్ట్, గం గం గణేశ, భజే వాయువేగం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో హిట్ లిస్ట్, గం గం గణేశ సినిమాల్ని పక్కనపెడితే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం సినిమాలు ప్రస్తుతానికి లైమ్ లైట్లో ఉన్నాయి. ఇవి హిట్టవుతాయా.. బ్రేక్ ఈవెన్ అందుకుంటాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మొత్తమ్మీద మే నెలలో చివరి రోజు రిలీజైన సినిమాల్ని మినహాయిస్తే.. నెల మొత్తంలో ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు. సమ్మర్ బాక్సాఫీస్ వృధా అయింది. ఇక ఆశలన్నీ జూన్ నెలపైనే.