క్రికెట‌ర్ అంబ‌టి సెటైర్స్ తెచ్చిన తంటా

మ‌న విష‌యంలో ఎదుటి వాళ్లు ఎలా వుండాల‌ని కోరుకుంటామో, మ‌నం కూడా వాళ్ల‌తో అంతే గౌర‌వంగా వుండాలి. మ‌ర్యాద‌గా మెలిగితే ఎలాంటి చిక్కులుండ‌వు. నోరు ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగితే, చిక్కులు…

మ‌న విష‌యంలో ఎదుటి వాళ్లు ఎలా వుండాల‌ని కోరుకుంటామో, మ‌నం కూడా వాళ్ల‌తో అంతే గౌర‌వంగా వుండాలి. మ‌ర్యాద‌గా మెలిగితే ఎలాంటి చిక్కులుండ‌వు. నోరు ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగితే, చిక్కులు త‌ప్ప‌వు. క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు మైదానంలో బ్యాట్‌కు ప‌ని చెబితే, అభిమానులు అభినందించారు. అయితే అంబ‌టి నోటికి ప‌ని చెప్ప‌డంతో, ఇబ్బందులు త‌ప్ప‌లేదు.

ల‌క్ష‌లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని చూర‌గొంటున్న విరాట్‌కోహ్లీపై అంబ‌టి నోరు పారేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో విరాట్ ఫ్యాన్స్‌కి కోపం వ‌చ్చింది. అంబ‌టికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చ‌రిక కాస్త హ‌ద్దు మీరింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లు వివాదానికి దారి తీసిన అంబ‌టి సెటైర్స్ గురించి తెలుసుకుందాం. 

ఐపీఎల్ -2024లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వ‌హించారు. ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్‌ను ఆయ‌న ద‌క్కించుకున్నారు. అయితే బెంగ‌ళూరు జ‌ట్టు క‌నీసం సెమీ ఫైన‌ల్‌కు చేర‌లేదు. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న అంబ‌టి రాయుడు త‌న మార్క్ స్వ‌భావాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆరెంజ్ క్యాప్ టైటిల్ ఐపీఎల్ ట్రోపీని గెలిపించ‌లేక‌పోయింద‌ని కోహ్లీపై వ్యంగ్యాస్త్రం విసిరారు. అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. 

ప్లే ఆఫ్స్ చేర‌గానే ఐపీఎల్ టైటిల్ గెలిచినంత‌గా బెంగ‌ళూరు ఆటగాళ్లు సంబ‌రాలు చేసుకున్నారంటూ చుర‌క‌లు అంటించారు. అంబ‌టి కామెంట్స్ ఆర్సీబీ, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్‌లో మంట పుట్టించాయి. అంబ‌టి రాయుడిపై బూతుల‌పై విరుచుకుప‌డ్డారు. అలాగే అత‌ని భార్య‌, కుమార్తెల‌ను ఏదో చేస్తామంటూ హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ హెచ్చ‌రిక‌ల‌పై అంబ‌టి కుటుంబం ఆందోళ‌న చెందుతున్న స‌మాచారం బయ‌టికొచ్చింది.

గెలుపోట‌ముల‌ను స్పోర్టీవ్‌గా తీసుకోడానికి బ‌దులు, రెచ్చ‌గొట్టేలా, అవ‌మానించే విధంగా అంబ‌టి రాయుడు కామెంట్స్ చేయ‌డం వ‌ల్లే వివాదం త‌లెత్తింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.