బీజేపీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పత్రిక సాక్షి స్వామి భక్తిని ప్రదర్శించింది. గురువారం నాటి సాక్షి పత్రికలో కార్టూన్ చూస్తే… వైసీపీ శ్రేణులు చీదరించుకునేలా వుంది. ఇంకా ఎన్నికల ఫలితాలు కూడా వెలువడలేదు. అప్పుడే బీజేపీపై భక్తిని ప్రదర్శించడం ఏంటనే నిలదీత వైసీపీ శ్రేణుల నుంచి వస్తోంది.
విపక్షాలు చల్లే బురదలో కమలం వికాసం పొందుతోందని ప్రధాని మోదీ అన్న మాటల్ని తీసుకుని, అందుకు తగ్గటు బీజేపీకి సానుకూలంగా కార్టూన్ వేశారు. విపక్ష నాయకుడు బురద చల్లుతున్నట్టు, అందులో కొట్టుకొస్తున్న కమలాన్ని మోదీ తీసుకుంటున్నట్టుగా కార్టూన్ వేశారు.
ఏపీలో వైసీపీకి బీజేపీ ప్రత్యర్థి అనే సంగతిని సాక్షి మీడియా మరిచిపోయినట్టుంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుని, తద్వారా వ్యవస్థల సహకారంతో తమను ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టారు, పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ దన్నుతోనే టీడీపీ నేతలు అరాచకాలకు తెరలేపారని, అలాగే ఈసీని గుప్పిట్లో పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇవేవీ సాక్షి మీడియాకు పట్టనట్టుంది.
ప్రతిపక్షాలు తమపై బురద చల్లుతున్నారని ప్రధాని మోదీ అంటే, సాక్షికి తేనెలొలికే మాటలుగా అనిపిస్తున్నట్టుంది. ఒకవైపు ఏపీలో వైసీపీ ఓటమికి బీజేపీ అన్ని రకాలుగా సహకరిస్తుంటే, మరి ఏ కారణంతో ఆ పార్టీని సాక్షి నెత్తిన పెట్టుకుంటున్నదో అర్థం కావడం లేదనే కామెంట్స్ వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.