మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు టీడీపీకి టార్గెట్ అయ్యారని వారు అంటున్నారు. సొంత సర్కార్‌లో పిన్నెల్లికి ఇబ్బందులు తప్పలేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. వైఎస్ జగన్ కోసం ఎంతో చేసిన పిన్నెల్లికి, అటు వైపు నుంచి సరైన ఆదరణ లభించలేదని వారు అంటున్నారు.
గతంలో జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారని వారు గుర్తు చేస్తున్నారు. పల్నాడులో వైసీపీని బలోపేతం చేయడానికి పిన్నెల్లి ఎంతో కృషి చేశారు. వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే, అనుచరులకు ఎంతోకొంత మంచి చేయవచ్చని పిన్నెల్లి భావించారు. అయితే సొంత ప్రభుత్వంలోనూ పిన్నెల్లికి పోరాటం తప్పలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జగన్‌కు సలహాలు, సూచనలు ఇస్తారనే ప్రచారం ఉన్న నాయకుడు కక్ష కట్టి, మాచర్లలో ఆయనకు వ్యతిరేకంగా పోలీస్ అధికారిని నియమించడాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చుకోడానికి ఎంతో చేసిన తనను జగన్ ఆదరిస్తారని పిన్నెల్లి ఎంతో నమ్మకంగా ఉన్నారు. రెండో విడత కేబినెట్ విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో పిన్నెల్లి తట్టుకోలేకపోయారు.
దీంతో జగన్‌కు సలహాలిచ్చే నాయకుడు కాని నాయకుడి దగ్గరికెళ్లి నోటికొచ్చినట్టు తిట్టారు. అలాగే తనకు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇప్పించడం లేదని సదరు సలహాదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పిన్నెల్లిపై కక్ష పెంచుకున్న సదరు సలహాదారుడు… పల్నాడు ఏఎస్పీగా బిందుమాధవ్‌ను నియమించారు. తనకు ఇబ్బంది అవుతుందని, వద్దని వారించినా ఆ సలహాదారుడు వినిపించుకోలేదు.
పైపెచ్చు పిన్నెల్లి ఏది వద్దని చెబితే, ఆ పనే ఏఎస్పీ చేయడం మొదలు పెట్టారు. గుట్కా విక్రయాలకు సంబంధించి పిన్నెల్లి అనుచరులపై ఏఎస్పీ కేసు పెట్టారు. అలాగే మరికొందరు కేసు పెడుతున్నారని తెలిసి, వారంతా అమాయకులని వద్దని చెప్పినా, ఏఎస్పీ మాత్రం సలహాదారుడి ఆదేశాల మేరకు ఆయనకు వ్యతిరేకంగానే నడుచుకున్నారు.
సొంత ప్రభుత్వంలో తన వాళ్లను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిపై సీఎంవోకు వెళ్లి నెత్తీనోరూ కొట్టుకుని పిన్నెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఎస్పీని బదిలీ చేశారు. తనను బదిలీ చేశాడని మాచర్ల ఎమ్మెల్యేపై బింధుమాధవ్ అక్కసు పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్నే పల్నాడు ఎస్పీగా ఈసీ నియమించింది. పాత విషయాల్ని గుర్తు పెట్టుకున్న ఎస్పీ… టీడీపీకి రిగ్గింగ్‌కు అనుకూలమైన గ్రామాల్లో ఒకరిద్దరు పోలీసుల్ని మాత్రమే నియమించారు.
ఇదే వైసీపీ రిగ్గింగ్‌కు అనుకూలమైన గ్రామాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని దింపారు. టీడీపీ యథేచ్ఛగా కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్‌కు స్వయంగా ఎస్పీనే ప్రోత్సహించేలా వ్యవహరించారు. వైసీపీని కట్టడి చేశారు. తాజాగా పిన్నెల్లి వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా ఇప్పుడు తెరపైకి వచ్చింది.
పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేస్తే, ఎల్లో మీడియా తెగ బాధపడిపోతూ కథనాలు రాయడం చూస్తే, ఆ ఎస్పీ గారు ఎంతగా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక దశలో రాజకీయాలు మానేస్తామని పిన్నెల్లి సోదరులు అనుకున్నారంటే, జగన్ సర్కార్‌లో వారెంత మనో వేదనకు గురి అయ్యారో అర్థం చేసుకోవచ్చు. తన కోసం ఎంతో చేసిన పిన్నెల్లి సోదరులను సీఎం జగన్ ఏ మాత్రం పట్టించుకోకపోగా, ఇప్పుడు వారిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశారు. తనకు కష్టం వస్తే అందరూ చుట్టూ వుండాలని జగన్ కోరుకుంటారు. అంతే తప్ప, తన కోసం కష్టనష్టాలకు గురి అయ్యారంటే, జగన్‌కు పెద్దగా పట్టింపు వుండదనేందుకు పిన్నెల్లి ఉదంతమే నిదర్శనమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.