జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకంటె తాను కొత్తగా ఏదో ఒక బిస్కట్ వేస్తే తప్ప ప్రజల మన్నన చూరగొనడం అసాధ్యం అని చంద్రబాబునాయుడు అనుకున్నారు. ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి తీరాలని తెగించేసి ఉన్న ఆయన తనను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని వాగ్దానం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గానీ, రాహుల్ గాంధీ గానీ అంతకంటె ఘోరంగా తెగించేసి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చాలు.. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి మహిళకు నెలకు 8500 రూపాయలు ఇస్తామని చాలాకాలంగా చెబుతున్నారు.
ఇప్పుడు ఇంకో విడత పోలింగ్ కూడా మిగిలి ఉండగా.. రాహుల్ గాంధీ మరింత తెగించేసినట్టుగా కనిపిస్తున్నారు. ఏడాదికి లక్ష రూపాయల వరకు ప్రతి మహిళకు ఇస్తామని ప్రకటిస్తున్న ఆయన.. ఇప్పుడు దాన్ని డబుల్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని ఏడాదికి రెండు లక్షల వరకు పెంచే అవకాశం కూడా ఉన్నదని ఆయన అంటున్నారు.
ఒకవైపు మోడీ సర్కారు మంచో చెడో గానీ.. తాయిలాల రాజకీయాలకు తాము వ్యతిరేకం అనే చెప్పుకుంటూ వస్తున్నది. ఏదో గ్యాస్ సిలిండర్ మీద కొన్ని రాయితీలు, పేదలకు ఉచిత బియ్యం వంటివి తప్ప ఆ పార్టీ ప్రకటిస్తున్న తాయిలాలు పెద్దగా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ధోరణి చూస్తే చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది.
ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.8500 ఇస్తానని చెప్పడమే అతిశయమైన సంగతి. గ్రామాలు చిన్న పట్టణాల్లో మధ్యతరగతి వ్యాపారాలలో ఉద్యోగులకు ఇచ్చే నెలజీతం అది. అలాంటిది ఏడాదికి రెండులక్షలు అంటే.. నెలకు దాదాపు 17వేలు ఇస్తున్నట్టుగా భావించాలి. ఈ మొత్తం ఒక మధ్యతరగతి ఉద్యోగి జీతానికి సమానం.
చిన్న పట్టణాల్లో ఒక సామాన్య/ మధ్యతరగతి కుటుంబం మొత్తం బతుకు గడపడానికి సరిపోయే మొత్తం అది. అంతమొత్తం ప్రభుత్వం ఉచితంగా మహిళకు ఇవ్వడం ప్రారంభిస్తే.. ఇక ఆ కుటుంబం.. రికార్డులకెక్కే ఆదాయం పరంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉండడానికే ప్రయత్నిస్తుంది తప్ప.. ఆర్థికంగా ఎదగడం గురించి ఎందుకు ఆలోచిస్తుంది?
ఒక మధ్యతరగతి కుటుంబం హాయిగా జీవనం సాగించడానికి సరిపడే మొత్తం ప్రభుత్వమే తేరగా ఇచ్చేస్తోంటే ఇక ఎవరు మాత్రం పనిచేయాలనుకుంటారు. ఎంచక్కా నిమ్మళంగా కాలిమీద కాలు వేసుకుని దర్జాగా గడిపేద్దాం అనుకోకుండా ఉంటారా?
ఎలాగైనా సరే పేద వర్గాలకు చెందిన మహిళల ఓట్లను స్థిరమైన ఓటుబ్యాంకుగా మార్చుకోవాలనే కక్కుర్తితో రాహుల్ ఇలాంటి హామీలు ఇవ్వడం తగునా అనే చర్చ ఆలోచన పరుల్లో నడుస్తోంది. మరి ఇలాంటి హామీలను ఎందరు నమ్మి ఇండియా కూటమికి ఓటు బ్యాంకుగా మారుతారో తెలియదు గానీ.. ఇలాంటివి ఇష్టపడని వారుమాత్రం ఎగబడి ఎన్డీయే కూటమికి, భాజపాకు ఓటు వేసే అవకాశం ఉన్నది.