ఇదే నిజమైతే.. ప్రమాదం పొంచి వున్నట్లే!

ఈనాడు పత్రిక అలాగే రాస్తుందిలే అని ఊరుకుంటే, జగన్ ను అభిమానించే వారికి ఉపశమనంగా వుండొచ్చు. కానీ రాష్ట్రాన్ని అభిమానించే వారికి మాత్రం కాదు. ఎందుకంటే వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం. దాని భవిష్యత్…

ఈనాడు పత్రిక అలాగే రాస్తుందిలే అని ఊరుకుంటే, జగన్ ను అభిమానించే వారికి ఉపశమనంగా వుండొచ్చు. కానీ రాష్ట్రాన్ని అభిమానించే వారికి మాత్రం కాదు. ఎందుకంటే వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం. దాని భవిష్యత్ ముఖ్యం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ గడచిన రెండు నెలల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్లు అప్పు చేసింది అన్న పాయింట్.

ప్రతి నెల పదివేల కోట్లు అప్పు అవసరం పడకపోవచ్చు. భవిష్యత్‌లో ఆదాయం పెరగడం ద్వారా అప్పులు తగ్గవచ్చు. అది వేరే సంగతి. కానీ ఇప్పటికిప్పుడు ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే మాత్రం దారుణంగా వుందని క్లారిటీ వస్తోంది.

గత అయిదేళ్లుగా ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి మీద నిత్యం కథనాలు వస్తూనే వున్నాయి. అవేం కొత్త కాదు. చంద్రబాబు సైతం లక్షన్నర కోట్ల మేరకు ఆంధ్ర అప్పును పెంచారని వైకాపా చెబుతుంది. ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారని తెలుగుదేశం అనుకుల మీడియా చెబుతుంది. ఎవరు చెప్పినా, చెప్పకున్నా ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా వుందన్న క్లారిటీ జనాలకు వుంది. అయితే మీర నెలకు 10వేల కోట్లు అప్పు కావాల్సినంత పరిస్థితికి దిగజారిందా? అన్నదే అనుమానం.

ఎందుకంటే నెలకు పది వేల కోట్లు అంటే ఏడాదికి లక్ష కోట్ల పైమాటే. మన బడ్జెట్ విలువతో పోల్చుకుంటే దగ్గర దగ్గర 80 శాతం అన్న మాట. ఈ పరిస్థితి ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది. జగన్ అధికారంలోకి వస్తే ఇలాగే వుంటుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంకా అప్పులు పెంచాల్సి వుంటుంది. అప్పుడు ఏ నెల ఎంత అప్పు తెచ్చారో మీడియా చెప్పకపోవచ్చు. కానీ తేవాల్సిందే. సంపద పెంచుతాం లాంటి పడికట్టు పదాలు వినడం వరకు, ప్రచారం వరకు బాగుంటాయి. వాస్తవంగా జరిగే పరిస్థితి ఇప్పుడు లేదు.

అందువల్ల ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి అలార్మింగ్ అంచుల్లో వున్నట్లే. దీన్ని గాడిన పెట్టడం అంత సులవుకాదు. నిర్మొహమాటంగా ఉచితాలు ఆపేయాల్సిందే. కానీ ఆపరు.. ఎప్పుడు ఆపుతారు అంటే ఇంక పూర్తిగా పరిస్థితి చేజారిపోయి, అప్పు పుట్టని పరిస్థితి వచ్చినపుడు. పెరుగుట విరుగట కొరకే అన్నట్లు అలాంటి పరిస్థితి రావాల్సిందే. అప్పుడు కానీ ఉచితాలు ఏ పార్టీ కూడా ఆపవు. రూపాయి నేను ఇస్తా అంటే రెండు రూపాయిలు నేను ఇస్తా అనే పార్టీలే రెండూ కూడా.

ఇదే పరిస్థితి మరో అయిదు పదేళ్లు కొనసాగితే యువతరం అంతా పక్క రాష్ట్రాలకు పూర్తిగా వలసపోతుంది. పోవాల్సిందే. తప్పదు.