కౌంటింగ్‌కు ముందు, త‌ర్వాత‌.. అక్క‌డ గొడ‌వ‌లు!

ఈ ద‌ఫా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు అక్క‌డ‌క్క‌డ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు దారి తీశాయి. ఈ నెల 13న జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ, ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఈసీ ఆదేశాల మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం సిట్…

ఈ ద‌ఫా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు అక్క‌డ‌క్క‌డ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు దారి తీశాయి. ఈ నెల 13న జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ, ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఈసీ ఆదేశాల మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. ఇవాళ సిట్ ప్రాథ‌మిక నివేదిక‌ను డీజీపీకి స‌మ‌ర్పించ‌నుంది.

ఇదిలా వుండ‌గా గొడ‌వ‌ల‌కు సంబంధించి తాజా అప్డేట్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాకినాడ‌, పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో కౌంటింగ్‌కు ముందు, ఆ త‌ర్వాత గొడ‌వ‌ల‌కు జ‌ర‌గొచ్చ‌ని ఇంటెలిజెన్స్ శాఖ ఈసీకి నివేదించిన‌ట్టు తెలిసింది. పిఠాపురంలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ను ఓడించేందుకు అధికార పార్టీ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేసింది. ఎన్నిక‌ల ఫ‌లితం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పోటీ నువ్వా నేనా అన్న‌ట్టుగా సాగింద‌ని అనేక స‌ర్వే సంస్థ‌లు చెబుతున్నాయి. 

అలాగే కాకినాడ‌లో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌తంలో ప‌లుమార్లు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. కాకినాడ సిటీలో ఈడ్చుకెళ్తాన‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. కాకినాడ సిటిలో ద్వారంపూడిని ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. అయిన‌ప్ప‌టికీ ద్వారంపూడినే విజ‌యం వ‌రిస్తుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో రానున్న రోజుల్లో అల్ల‌ర్లు చెల‌రేగ వ‌చ్చ‌ని నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక అందోళ‌న క‌లిగిస్తోంది. అల్ల‌ర్ల‌కు చోటు లేకుండా ఈసీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ ప్ర‌జానీకం నుంచి వ‌స్తోంది. ఇప్ప‌టికే కొన్నిచోట్ల గొడ‌వ‌ల‌తో అన్ని పార్టీల కార్య‌క‌ర్త‌లు పరారీలో ఉన్నారు. క‌ళ్ల ముందే వారి క‌ష్టాలు క‌నిపిస్తుండ‌గా, గొడ‌వ‌ల‌కు వెళ్ల‌డం అంటే, అంత‌కు మించిన అజ్ఞానం వుండ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.