ఈమె కూడా పవన్ కల్యాణ్ లా చేయట్లేదు

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేంకాదు, దశాబ్దాలుగా చూస్తున్నాం. అయితే అలా వచ్చిన నటీనటుల్లో చాలామంది సినిమాల్ని పక్కనపెట్టారు. తాజాగా వచ్చిన వాళ్లు కూడా సినిమాలకు స్వస్తి చెబుతామని అన్నారు. ఒక్క పవన్ కల్యాణ్…

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేంకాదు, దశాబ్దాలుగా చూస్తున్నాం. అయితే అలా వచ్చిన నటీనటుల్లో చాలామంది సినిమాల్ని పక్కనపెట్టారు. తాజాగా వచ్చిన వాళ్లు కూడా సినిమాలకు స్వస్తి చెబుతామని అన్నారు. ఒక్క పవన్ కల్యాణ్ తప్ప.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం తను సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తానంటున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. ఏపీలో ఎన్నికల ప్రహసనం ముగిసింది. కాబట్టి రేపోమాపో పవన్ కల్యాణ్ తిరిగి తన సినిమాల్లోకి వెళ్లిపోతారు. ఆయన ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు కూడా.

కంగనా రనౌత్ మాత్రం అలా చేయనంటోంది. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ, ఎన్నికల్లో తను గెలిస్తే, పూర్తిగా బాలీవుడ్ కు దూరమౌతానని ప్రకటించింది.

“సినిమా ప్రపంచం అబద్ధం. అక్కడంతా నకిలీ. వాళ్లు చాలా భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. అది ఆడియన్స్ ను ఆకర్షించే నిగనిగలాడే ప్రపంచం. అది ఓ పెద్ద నీటి బుడగ. ఇప్పుడు నేనున్న రాజకీయ ప్రపంచం వాస్తవం. ఎన్నికల్లో గెలిస్తే ఈ వాస్తవంలోనే బ్రతకాలనుకుంటున్నాను. బాలీవుడ్ నుంచి పూర్తిగా తప్పుకుంటాను.”

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చేసింది కంగన. నిజానికి ఇది చాలా మంచి విషయం. ఏదో ఒక రంగంలో కొనసాగుతూ, దానిపై పూర్తిగా దృష్టి పెట్టడం చాలా అవసరం. రీసెంట్ గా తమిళ నటుడు విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి, కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతానంటూ విస్పష్టంగా ప్రకటించాడు.

అటు విశాల్ కూడా, ఏదో ఒక టైమ్ లో తను కూడా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటిస్తూనే, ఆ రోజున సినిమాలకు దూరమౌతానని కూడా తెలిపాడు. ఇక రజనీకాంత్ అయితే పూర్తిగా రాజకీయాలకు దూరమై, సినిమాలే లోకంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, కమల్ హాసన్ మాత్రమే అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తున్నారు.