“పెద్ద బ్రాండ్.. అంతా నాసిరకం, ప్రాణాలతో చెలగాటం” పేరిట ఇప్పటికే గ్రేట్ ఆంధ్రలో కథనం ఇచ్చాం. హైదరాబాద్ లో ఫేమస్ రెస్టారెంట్లలో జరిగే ‘చెత్త బాగోతం’ గురించి చాలామంది చదివే ఉంటారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరిన్ని ఫేమస్ హోటళ్లు జాబితాలోకి చేరాయి. చివరికి హైదరాబాద్ లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్ లో మంచి ఫుడ్ దొరకడం లేదు. ఇది పచ్చి నిజం.
వీకెండ్ వస్తే హైదరాబాదీలు రెస్టారెంట్ల మీద పడతారు. లంచ్, డిన్నర్ అన్నీ హోటళ్లలోనే. కొంతమంది ఉదయాన్నే బయల్దేరి, రకరకాల ప్లేసులు కవర్ చేసి, బయటే తిని ఇంటికొస్తుంటారు. ఇలా బయట తినే హైదరాబాదీలంతా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. పెద్ద పెద్ద హోటల్స్, మాల్స్ లోనే నాసిరకం ఉత్పత్పులు అమ్ముతున్న విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారు.
వారం రోజులుగా నగరంలోని ప్రముఖ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈసారి మరిన్ని పెద్ద కంపెనీలు అడ్డంగా దొరికాయి. పేరుపొందిన రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం సరుకులు, గడువు తీరిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారు.
ఇక జంబో కింగ్ ఔట్ లెట్స్ లో పిజ్జాలు సరేసరి. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతున్నారట. ఫ్రిడ్జ్ లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు టేబుల్స్ పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయంట. ఇక నగరంలోని కొన్ని కేఎఫ్ సీ ఔట్ లెట్స్ కు సరైన మెడికల్ అనుమతులు కూడా లేనట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్.
ప్రముఖ రెస్టారెంట్ ఛెయిన్ రాయలసీమ రుచుల్లో పరిస్థితి మరీ దారుణం. నాసిరకం మైదా, పసుపు, వెళ్లుల్లిని గుర్తించి నాశనం చేశారు. ఇక రెస్టారెంట్ కిచెన్ అంతా బొద్దింకల మయం. ‘కస్టమర్లు కిచెన్ లోకి రాకూడదు’ అనే బోర్డును ఎందుకు పెడతారో ఇప్పటికైనా అర్థమైందా?
కిచెన్ లో అపరిశుభ్రత చూస్తే అక్కడికక్కడే వాంతి చేసుకోవడం గ్యారెంటీ. మరో దారుణాతిదారుణమైన విషయం ఏంటంటే, కొన్ని హోటల్స్ కిచెన్స్ లో పక్కనుంచే మురుగు కాల్వలు వెళ్తున్నాయి. అది కూడా ఓపెన్ గా. వ్యర్థాలు అందులో వేయడానికి ఈజీగా ఉంటుందని ఆ సౌలభ్యం ఏర్పాటుచేసుకున్నారట. మరి కస్టమర్ల పరిస్థితేంటి?
నగరంలో పేరు పొందిన కామత్ హోటల్, షాగోస్, సుఖ్ సాగర్.. ఇలా చాలా రెస్టారెంట్లలో నాసిరకం ఆహార పదార్థాల్ని వేడివేడిగా వడ్డించేస్తున్నారు. మన జేబులతో పాటు ఆరోగ్యానికి కూడా చిల్లు పెడుతున్నారు. షాగోస్ లో వెజ్, నాన్-వెజ్ ఉత్పత్తులన్నింటినీ కలిపే ఉంచారంట. కామత్ లో సీల్ లేని టీపొడి వాడుతున్నారు. సుఖ్ సాగర్ లో కాలం చెల్లిన పుట్టగొడుగులు కనిపించాయి.
చివరికి గోలీ సోడాలో కూడా ప్రమాణాలు పాటించడం లేదని టాస్క్ ఫోర్స్ గుర్తించింది. నగరంలోని కీలకమైన 8 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా, ఒక్క రెస్టారెంట్ లో కూడా సరైన ప్రమాణాలు లేకపోవడం బాధాకరం. వీటిలో ఫైవ్ స్టార్ ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. ఇక ఐస్ క్రీమ్ పార్లర్లలో ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ లెక్కలేనన్ని గుర్తించారు.
ఐస్ క్రీమ్ పార్లర్లు, బేకరీలు నుంచి రెస్టారెంట్స్ వరకు.. ఇలా అన్నింటిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. డబ్బులు దండుకోవడమే పరమావధిగా సాగుతోంది. కస్టమర్ల ఆరోగ్యం ఎవడికి కావాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. తస్మాత్ జాగ్రత్త.