విశాఖ ఎంపీ సీటు ఎవరిది?

విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫున బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేశారు. ఆయనకు ఇది రెండోసారి పోటీ. అంగబలం అర్థబలంతో ఆయన బరిలోకి దిగారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి…

విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫున బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేశారు. ఆయనకు ఇది రెండోసారి పోటీ. అంగబలం అర్థబలంతో ఆయన బరిలోకి దిగారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పోటీలో ఉన్నారు.

ఆమెకు సామాజిక వర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మద్దతు దక్కింది అని అంటున్నారు. అలాగే వైసీపీకి ఈసారి విశాఖ నగరంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడింది అని అంటున్నారు. అలాగే క్రాస్ ఓటింగ్ కూడా విశాఖ ఎంపీ సీటు పరిధిలో జరిగింది అని అంటున్నారు.

ఆ విధంగా చూస్తే అది ఎవరికి చేటు చేసింది, ఎవరికి మేలు చేసింది అన్నది కూడా రెండు శిబిరాలలో తర్కించుకుంటున్నారు. బలమైన ఒక సామాజిక వర్గం ఈసారి విశాఖ ఎంపీ సీటుని కైవశం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఆ వర్గం మద్దతు వైసీపీకే దక్కింది అన్నది ప్రచారంలో ఉంది.

విశాఖ సిటీ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి ఉన్న విజయావకాశాలు కూడా బొత్స ఝాన్సీకి సానుకూలతను పెంచాయని అంటున్నారు. అయితే టీడీపీ అభ్యర్థిని తక్కువ అంచనా వేయడానికి లేదు అన్నది మరో విశ్లేషణ. ఆయనకు కూడా ఈసారి సానుభూతి ఎక్కువగా ఉందని అంటున్నారు.

గతసారి తక్కువ మెజారిటీతో ఓటమి పాలు అయ్యారు కాబట్టి ఈసారి గెలిపించాలని మరో బలమైన సామాజిక వర్గంతో పాటు అర్బన్ ఓటర్లు కొన్ని కీలక సెక్షన్లు పనిచేశాయని అంటున్నారు. అయితే విశాఖ ఎంపీ సీటు పరిధిలో పోలింగ్ తక్కువగా జరిగింది. 71 శాతం మాత్రమే సాగడంతో ఇది ఎవరి కొంప ముంచుతుంది అన్నదే అంతటా హాట్ హాట్ డిబేట్ ని పెడుతోంది.