ఆర్ఆర్ఆర్ హీరోలపై ‘భారతీయుడు’ ఎఫెక్ట్

భారతీయుడు-2 సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా ప్రభావం కమల్ హాసన్ పై ఎంత పడుతుంది. సిద్దార్థ్ పై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే విషయం పక్కనపెడితే.. ఓ ఇద్దరికి మాత్రం వెంటనే…

భారతీయుడు-2 సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా ప్రభావం కమల్ హాసన్ పై ఎంత పడుతుంది. సిద్దార్థ్ పై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే విషయం పక్కనపెడితే.. ఓ ఇద్దరికి మాత్రం వెంటనే ఎఫెక్ట్ చూపించింది. వాళ్లే దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు అనిరుధ్.

భారతీయుడు-2 సినిమా మేకింగ్ విషయంలో శంకర్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. 96లో తీసిన భారతీయుడు దగ్గరే అతడు ఆగిపోయాడంటూ చాలా పెద్ద కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎమోషనల్ గా సన్నివేశాలు తెరకెక్కించే మేజిక్ ను శంకర్ కోల్పోయాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

దీంతో ఇప్పుడు శంకర్ పై ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే, అతడి నుంచి వెంటనే మరో సినిమా వస్తోంది. అదే గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారతీయుడు-2 హిట్టయితే గేమ్ ఛేంజర్ పై మరిన్ని అంచనాలు పెరిగేవి. కానీ ఆ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో, గేమ్ ఛేంజర్ పై అంచనాలకు బదులు అనుమానాలు పెరిగాయి.

శంకర్ లో ఇప్పటికీ అదే మేజిక్ టచ్ ఉందని నమ్మిన చాలామందికి భారతీయుడు-2 షాక్ ఇచ్చింది. ఫలితంగా గేమ్ ఛేంజర్ తో శంకర్ తననుతాను నిరూపించుకోవాల్సిన స్థితిలో పడ్డాడు. యూనిట్ లో ఇప్పుడు అందరికంటే శంకర్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంది.

ఇక భారతీయుడు-2 ప్రభావాన్ని నేరుగా ఫేస్ చేస్తున్న మరో వ్యక్తి అనిరుధ్. సినిమా రిలీజైన వెంటనే వినిపించిన విమర్శ.. ఏఆర్ రెహ్మాన్ స్థాయిని అనిరుధ్ అందుకోలేకపోయాడని. అది నిజం కూడా. పాటలతో మెప్పించలేకపోయిన అనిరుధ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు.

దీంతో ఇప్పుడు అందరి చూపు దేవర సినిమాపై పడింది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది. మరీ రికార్డులు తిరగరాయకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. మరి మిగతా పాటల సంగతేంటి?

దేవర రిలీజైన తర్వాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కచ్చితంగా చర్చ ఉంటుంది. ఎందుకంటే, ఇంతకుముందు తన సినిమాలతో అనిరుధ్ సృష్టించిన సంచలనం అలాంటిది. మరి ఆ అంచనాల్ని అనిరుధ్ అందుకుంటాడా? లేక భారతీయుడు-2 ట్రెండ్ నే కొనసాగిస్తాడా? ఇలా ఇటు శంకర్, అటు అనిరుధ్ కారణంగా.. ఆర్ఆర్ఆర్ హీరోల సినిమాలపై అనుమానాలు ఎక్కువయ్యాయి.