చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు స్వీకరించిన తరువాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి కేసు నమోదు అయింది. చంద్రబాబు సీఎం అయ్యాక సరిగ్గా నెలరోజులకు జగన్ పై క్రిమినల్ కేసు నమోదు కావడం కేవలం యాదృచ్ఛికమే కావొచ్చు.
ఉండి ఎమ్మెల్యే, గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామక్రిష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అయితే.. జగన్ మీద కొత్త ప్రభుత్వంలో నమోదు కాబోయే కేసుల్లో ఇది తొలికేసు మాత్రమేనని.. ఇంకా అనేకానేక కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వాధినేతగా తీసుకున్న నిర్ణయాల గురించి, అందులో ఉన్న అవినీతి గురించి కొత్త ప్రభుత్వం కేసులు పెడుతుందని అందరూ అనుకుంటూ వచ్చారు. గతంలో చంద్రబాబునాయుడు మీద కూడా.. అవినీతికేసు పెట్టించి జగన్ ఆయనను జైలుకు పంపిన సంగతి అందరికీ గుర్తుంది. అదే క్రమంలో ఇసుక వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావొచ్చు.. జగన్ ప్రభుత్వం అత్యధికంగా భ్రష్టు పట్టిన వ్యవహారాల్లోనే ఆయన మీద ఎక్కువ అవినీతికేసులు నమోదు అవుతాయని ప్రజలు ఊహిస్తున్నారు. అయితే ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందే.. జగన్ పై నమోదైన మొదటి కేసు హత్యాయత్నం అయింది.
ఈకేసులో జగన్ మూడో నిందితుడు. తనను అక్రమంగా అరెస్టు చేసి తీవ్రంగా హింసించి చంపడానికి ప్రయత్నించిన అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మొదటి నిందితుడుగా, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు రెండో నిందితుడుగా రఘురామ కేసు పెట్టారు. సీఐడీ ఏఎస్పీ, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటు కూడా నిందితులే.
అయితే జగన్ మీద రాబోయే రోజుల్లో, నమోదు కాబోయే కేసుల పరంపరకు ఇది బిగినింగ్ మాత్రమేనని అనుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు రఘురామ ఎలాంటి కేసునైతే పెట్టారో అదే తరహాలో.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారంటూ అనేక మంది సాధారణ వ్యక్తుల మీద గత ప్రభుత్వం కేసులు పెట్టి విచారణలు సాగించింది. వారంతా కూడా ఇప్పుడు రఘురామ తరహాలోనే జగన్ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున పెట్టే అవకాశం ఉన్న అవినీతి కేసులు వీటికి అదనం. ఆ రకంగా జగన్ పై కేసుల పరంపర సాగనున్నదని ప్రజలు అంచనా వేస్తున్నారు.