ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో తీవ్ర అసహనం కనిపిస్తోంది. కోరుకున్నట్టుగానే ఆయన నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. అయినప్పటికీ ఆయనలో తెలియని చిరాకు. అధికారులతో పాటు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. మీడియా సమావేశంలోనూ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంలోనూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలు ఆయనకు చిర్రెత్తుకొస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఇక ఆయన తిట్టు చెప్పాల్సిన పనేలేదు. మెంటలోడు, పిచ్చోడు, నియంత అంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. ఓడిపోయాడు కాబట్టి జగన్‌ను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నైనా తిట్టొచ్చు. కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడదాం.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంలో సాంకేతిక లోపాలు తలెత్తితే, ఇంతెత్తున ఆయన ఎగురుతున్నారు. ఏం సార్ అమరావతిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించగా, దిక్కు తెలియడం లేదని, ఏం చేయాలో మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్నించడాన్ని చూశాం. ఇకపై కూడా ప్రతి సోమవారం పోలవరం అని వెళ్తారా? అని ప్రశ్నించగా, ఇంకేం పోలవరం, ఏముందని వెళ్లాలంటూ ఆయన ప్రశ్నించారు.
ఉచిత ఇసుక అంటున్నారే తప్ప, గతంలో మాదిరే విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఏమంటారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడమే పాపమైంది. నేనే ఇసుకు తీసుకెళ్లి వాళ్లింట్లో ఇస్తానని, నేనే ఇల్లు కట్టిస్తానని విమర్శిస్తారేమో అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు లేదా నెత్తిన పెట్టుకునైనా ఇసుకు తీసుకెళ్లాలని చెప్పామని, ఎవరొద్దన్నారని ఆయన వెటకారంగా, తీవ్ర అసహనంగా మాట్లాడారు. కానీ ప్రభుత్వ నిబంధనలు వేరన్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితా బాగాలేకపోవడం, మరోవైపు నెరవేర్చాల్సిన హామీలు చాలా వుండడంతో బాబుకు దిక్కుతోచడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఆయనలో తీవ్ర అసహనం, ఆగ్రహం ఊరికే కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.