అంతన్నా డింతన్నాడే గంగరాజు.. పిడత కింద పప్నన్నాడే గంగరాజు.. అన్న పాట మీరు వినే ఉంటారు కదా. దానికి కాస్త సవరించి.. గంగరాజు బదులుగా చంద్రబాబు అని పెట్టుకుని పాడుకోవాలేమో. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. లక్షలకు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని, రాష్ట్రంలో అసలు నిరుద్యోగి అనే పదం వినబడకుండా చేస్తాననే స్థాయిలో చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీలు కురిపించారు. కానీ గద్దెమీదికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న తీరు కాస్త డిఫరెంట్ గా ఉంటోంది. చంద్రబాబు ఇలా అడుగుపెడితే.. అలా పరిశ్రమలు వచ్చి రాష్ట్రంలో వాలిపోతాయన్నట్టుగా ఇదివరలో మాట్లాడారు. కానీ.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
చంద్రబాబు నాయుడు మాటలు చెప్పిన తీరును బట్టి ఆయన పాలన వస్తే ఉపాధి కల్పనలు పెరుగుతాయని యువత ఆశించిన మాట నిజం. అంతమాత్రాన అధికారంలోకి వచ్చిన నెలలోనే పరిశ్రమలు వచ్చేయాలని ఎవరూ అనడం లేదు. రాకపోతే విఫలమైనట్టు చెప్పలేం కూడా. ఎందుకంటే.. ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమలు- ఉపాధులు ఏర్పడడానికి కనీసం ఆరునెలలు పడుతుందని అనుకోవచ్చు. కానీ.. చంద్రబాబునాయుడు ఇప్పుడు ఇంకో ట్విస్టు ఇస్తున్నారు. తాజా మాటల ప్రకారం.. పరిశ్రమలు రావడం అనేది అసలు ఏడాదిలోగా జరిగే అవకాశమే కనిపించడం లేదు.
2025 జనవరిలో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు తాను హాజరవుతానని.. పరిశ్రమలను, పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అంటే దావోస్ సదస్సుకు ముఖ్యమంత్రి వెళ్లి.. అక్కడ పారిశ్రామిక వేత్తలతో డీల్స్ కుదిరితే.. అవన్నీ గ్రౌండింగ్ అయ్యేలోగా కనీసం ఆరునెలలనుంచి ఏడాది పడుతుంది. అంటే.. గెలిచిన తర్వాత.. ఏడాది- ఏడాదిన్నర వరకు పరిశ్రమలు కొత్తగా మన రాష్ట్రానికి రావడం గురించి మరిచిపోవాలన్నమాట.
చంద్రబాబు నాయుడు తన కార్యసమర్థత గురించి తాను చెప్పుకునే మాటల ప్రకారం ఆయన నుంచి ప్రజలు, ప్రధానంగా యువతరం ఆశించేది ఇది కాదు. ఈ ఏడాది చివరిలోగా.. ఎలాగైతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలని అంటున్నారో.. అడుగులు ముందుకు వేస్తున్నారో.. అలాగే ఏడాది గడిచేలోగా కొన్ని పరిశ్రమలనైనా, సాఫ్ట్ వేర్ కంపెనీలనైనా రాష్ట్రానికి తీసుకువచ్చి యువతరానికి స్థానికంగానే ఉపాధి అవకాశాల సృష్టి చేయగలరని అనుకున్నారు. ఇప్పుడు ఆయన మాటలు దాటవేత ధోరణిలో ఉంటున్నాయి.