ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి అంటే భక్తికి, ప్రశాంతతకు నిలయం. ఇది నిన్నటి మాట. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. మనోడని సొంత సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసుల్ని ఆదరిస్తే, చివరికి తన భవనానికే ఎసరు పెట్టారని బాధితుడైన శ్రీధర్ వాపోతున్నాడు. బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ నాలుగు అంతస్తుల భవనం కూల్చివేతకు టీడీపీ నాయకులు అన్నా రామచంద్రయ్య బరితెగించారు. ఈ భవనంలో లాడ్జి నిర్వహిస్తున్నారు.
అంతేకాదు, శ్రీధర్ లాడ్జీకి వెళ్లి, అక్కడి వారిపై అన్నా రామచంద్రయ్య చేయి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతటితో అతని ఆగడాలు ఆగలేదు. నాలుగు అంతస్తుల భవనం పబ్లిక్ రోడ్డు అంటూ, తన అనుచరులతో రాయించి, కూల్చివేస్తానని నిత్యం బెదిరిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి కనీసం నెల రోజులు కూడా గడవకనే తిరుపతిలో దారుణాలకు తెరలేపారు. ఇక్కడ దౌర్జన్యకారులు, బాధితులు కూటమికి చెందిన వారే కావడం గమనార్హం.
తిరుమల బైపాస్ మార్గంలో ప్రకాశం పంతులు మున్సిపల్ పార్క్ ఎదురుగా విరజామార్గం ఉంది. ఆ మార్గంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్యకు స్థలం వుంది. ఈ స్థలం డీకేటీది కావడం గమనార్హం. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆయన స్థలంలో రోడ్డు వేయాల్సి వుంది. దీంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు తన స్థలం పక్కనే వున్న శ్రీధర్ అనే వ్యక్తికి చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌పై రామచంద్రయ్య కన్ను పడింది. శ్రీధర్ కొత్తగా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు.
అన్నా రామచంద్రయ్య ఎంతగా బరి తెగించాడంటే.. పబ్లిక్ రోడ్డు నాలుగు అంతస్తుల భవనంపై వెళుతుందని తన అనుచరులతో రాయించాడు. ఒకవేళ ఆ భవనాన్ని ప్రభుత్వ స్థలంలోనో, లేదా పబ్లిక్ రోడ్డులోనో నిర్మించి వుంటే, ఆ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాయాలి. చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. కూటమి అధికారంలోకి రావడంతో అధికారులు డమ్మీలుగా మారారు. ఎవరిది పైచేయి అయితే వారిదే రాజ్యం అన్నట్టుగా కూటమి నేతల అరాచకాలు సాగుతున్నాయి.
తన సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు స్థానికేతరుడైనప్పటికీ, మనోడనే భావనతో ఎగిరెగిరి ఓట్లు వేశాడు, వేయించాడు. శ్రీధర్‌లా ఆలోచించి ఆయన సామాజిక వర్గీయులు, ఆరణిని గెలిపించుకున్నారు. తీరా ఇప్పుడు తన నాలుగు అంతస్తుల భవనాన్ని టీడీపీ నేత కూల్చివేస్తానని బెదిరిస్తుంటే, తన కులపోడైన ఎమ్మెల్యే నోరెత్తడం లేదనేది ఆయన ఆవేదన.
ఇదిలా వుండగా శ్రీధర్‌కు చెందిన లాడ్జీకి తన అనుచరులతో స్వయంగా వెళ్ళి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేసి బయటకు తరిమేశాడు. ఆ ప్రాంత ప్రజలందరూ చూస్తుండగానే రోడ్డు మీద వారిపై దాడి చేసి తన గూండాయిజాన్ని ప్రదర్శించాడు. దీంతో అక్కడి ప్రజలు భయంతో వణికి పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చీ రాక ముందే బహిరంగంగా అన్నారామచంద్రయ్య దౌర్జన్యం చూసి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ప్రజలు భయపడుతున్నారు.