ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఇప్పటికైనా అర్థమైంది. తమ నాయకుడికి లేట్‌గా అయినా లేటెస్ట్‌గా జ్ఞానోదయం అయ్యిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా రోగమేంటో నిర్ధారణ అయితే, ట్రీట్మెంట్ ఇవ్వడం సులువు అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇంతకాలం వైసీపీ ఓటమికి ఈవీఎంలలో గోల్‌మాల్, అలాగే శకుని మాయా పాచికలంటూ జగన్ పదేపదే చెప్పడం సొంత పార్టీ వారికి కూడా నచ్చలేదు. తమ పాలనలో తప్పులు జరిగాయని జగన్ గుర్తించకపోవడంపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వుంది. కనీసం ఇప్పటికైనా గుడ్డిలో మెల్ల చందాన… కొద్దోగొప్పో వాస్తవాల్ని జగన్ గుర్తించారని వైసీపీ శ్రేణులు సర్దిచెప్పుకుంటున్నాయి.
నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్షారెడ్డిని పరామర్శించడానికి జగన్ గురువారం వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… “ప్రజలకు మంచి చేసి వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు” అని అన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ దఫా ఎన్నికలకు కొత్తగా మేనిఫెస్టోను ప్రకటించలేదు. 2019 ఎన్నికల నాటి మేనిఫెస్టోనే మళ్లీ కొనసాగిస్తానని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం సూపర్‌సిక్స్, ఇతరత్రా పథకాల పేరుతో జగన్ కంటే రెట్టింపు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తానని విస్తృతంగా ప్రచారం చేశారు. సహజంగా రెట్టింపు లబ్ధి కలిగిస్తానంటే ఆశ పడిన వారెవరు? ఇక్కడే జగన్‌ను రాజకీయంగా చావు దెబ్బతీశారు.
తాను చెప్పింది జనం నమ్ముతారని, చంద్రబాబును నమ్మరనే జగన్ అతి విశ్వాసమే వైసీపీ కొంప ముంచింది. అందుకే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు అలివిమాలిన హామీల్ని జనం నమ్మారని, తనను విశ్వసించలేదని జగన్ తెలుసుకోవడం వైసీపీకి మంచిది.