బాబు తెలివితేట‌లు జ‌గ‌న్‌కు ఎప్పుడొస్తాయో!

రాజ‌కీయాల్లో మెద‌డుకు నిత్యం ప‌దును పెట్టాలి. దాన్నే వ్యూహం అంటారు. రాజ‌కీయాల్లో నీతి, నిజాయితీల‌కు చోటు వుండ‌దు. గెలుపోట‌ములే ప్ర‌ధానం. అయితే ఇవేమీ శాశ్వ‌తం కాద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే గెలుపు…

రాజ‌కీయాల్లో మెద‌డుకు నిత్యం ప‌దును పెట్టాలి. దాన్నే వ్యూహం అంటారు. రాజ‌కీయాల్లో నీతి, నిజాయితీల‌కు చోటు వుండ‌దు. గెలుపోట‌ములే ప్ర‌ధానం. అయితే ఇవేమీ శాశ్వ‌తం కాద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే గెలుపు కోసమే అనునిత్యం ఆలోచిస్తుండాలి. అందుకు త‌గ్గ‌ట్టు ఆచ‌ర‌ణ కూడా వుండాలి. కానీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌లో ఆ స్పృహ ఇసుమంతైనా వున్న‌ట్టు క‌నిపించ‌దు.

నీతి, నిజాయితీ అంటూ ఆయ‌న మాట‌లు సొంత పార్టీ వాళ్ల‌కు కూడా విసుగు తెప్పిస్తుంటాయి. లేని వాటి గురించి ప‌దేప‌దే మాట్లాడ్డం ఏంట‌నేది వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ప్ర‌శ్న‌. చంద్ర‌బాబునాయుడిని చూసి త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ చాలా నేర్చుకోవాల‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెబుతున్నారు.

తాజాగా వ‌లంటీర్లనే తీసుకుందాం. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబునాయుడు వ‌లంటీర్ల‌కు నెల‌కు ఇప్పుడిస్తున్న రూ.5 వేల గౌర‌వ వేత‌నాన్ని తాము అధికారంలోకి వ‌స్తే రూ.10 వేలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో చాలా మంది వ‌లంటీర్లు కూట‌మి గెలుపు కోసం ప‌ని చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వ‌లంటీర్ల గురించి చంద్ర‌బాబు ఏమీ మాట్లాడ్డం లేదు. కానీ 100 ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్‌ను కొన‌సాగించాల‌ని, అది కూడా మూడేళ్ల‌కు కొత్త‌వారిని తీసుకోవాల‌ని క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్‌ను పెట్టి సేవ‌లందించారు. చంద్ర‌బాబు మాత్రం 100 ఇళ్ల‌కు ఒక వలంటీర్‌తో సేవ‌లందించేందుకు ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. నెల‌కు రూ.10 వేలు ఇచ్చిన‌ట్టు, అలాగే మాట నిల‌బెట్ట‌కున్న నాయ‌కుడిగా చంద్ర‌బాబు మిగిలిపోతారు. ఈ మాత్రం తెలివితేట‌లు జ‌గ‌న్‌కు లేక‌పోయాయని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

అలాగే పెన్ష‌న‌ర్ల‌కు రూ.వెయ్యి పెంచడంతో పాటు మూడు నెల‌ల అరియ‌ర్స్‌ను క‌లుపుకుని జూలై 1న రూ.7 వేలు ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. కానీ జ‌గ‌న్ మాత్రం రూ.500 పెంచి, అది కూడా 2028, 29 సంవ‌త్స‌రాల్లో పెంచిన సొమ్ము ఇస్తాన‌ని బ‌డాయికి పోయారు. ఎవ‌రికైనా డ‌బ్బు చేదా?  తాను త‌క్కువ ఇచ్చినా పెన్ష‌న‌ర్లు అండ‌గా నిలుస్తార‌ని జ‌గ‌న్ ఎందుకు అనుకున్నారో అర్థం కాదు.

ఒక‌వేళ రూ.500 పెంచాల‌ని అనుకున్నా, అక్క‌డి వ‌ర‌కు చెప్పి వుంటే బాగుండేద‌ని అంటున్నారు. అలా కాకుండా తానేదో నిజాయితీగా ఉన్నాన‌ని పెన్ష‌న‌ర్ల వ‌ద్ద చాటుకోడానికి చివ‌రి రెండేళ్ల‌లో పెంచుతాన‌ని జ‌గ‌న్ హెచ్చుల‌కు పోయాడ‌ని, ఎన్నిక‌ల్లో ఓట‌మి మూట‌క‌ట్టుకున్నాడ‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

అలాగే వైసీపీ మేనిఫెస్టోలో కొత్త‌ద‌నం క‌నిపించ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని వైసీపీ నాయ‌కులు సెటైర్స్ విసురుతున్నారు. 2019లో ఓట‌మితో చంద్ర‌బాబునాయుడు జాగ్ర‌త్త‌లు తీసుకోగా, జ‌గ‌న్ మాత్రం అతి విశ్వాసానికి వెళ్లి… చేజేతులా ఘోర ప‌రాభ‌వాన్ని కొని తెచ్చుకున్నార‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు.

ఏమైనా అంటే, చంద్ర‌బాబు మోస‌కారి, అత‌నిలా తాను వుండ‌డం ఏంట‌ని జ‌గ‌న్ చెబుతార‌ని వారు గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయాల్లో మోసాలుండ‌వ‌ని, కేవ‌లం గెలుపు మాత్ర‌మే మాట్లాడుతుంద‌న్న సంగ‌తి జ‌గ‌న్‌కు ఎవ‌రు చెప్పాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.