ఒక గుర్రం తొందరపడి రాజకీయాల్లోకి చేరాలనుకుంది. అక్కడ గాడిదల గుంపు కనిపించింది. గుర్రం ఆశ్చర్యపోయి “మీరంతా ఎప్పుడు చేరారు?” అని అడిగింది.
“రాజకీయాలు పుట్టినప్పటి నుంచి మాదే రాజ్యం. నువ్వే ఆలస్యం” చెప్పిందో గాడిద.
“ఇపుడు నేనేం చేయాలి?” “నోర్మూసుకుని జట్కా తోలుకోవాలి. లేదంటే గాడిదగా మారాలి” “గుర్రం గాడిదగా మారడం ఎలా?” “గాడిదలు గుర్రాలుగా చెలామణిలో వుంటూ పెద్దపెద్ద యుద్ధాలే చేశాయి. గుర్రం గాడిదగా మారడం ఎంత సేపు?”
గుర్రానికి తోక కత్తిరించారు. ఒంటికి బూడిద రంగు పూశారు. గార్దాభ స్వరాన్ని ప్రాక్టీస్ చేయించి పొలిటికల్ క్లాస్‌కి తీసుకెళ్లారు.
అక్కడ ఒక అనుభవ గాడిద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెబుతూ వుంది. “రాజకీయం అంటే తెలిసినా, తెలియకపోయినా ఓండ్రపెట్టాలి. ఓండ్రింపు ఎంత తీవ్రంగా వుండాలంటే దాన్ని జనం పులి గాండ్రింపుగా భావించి భయపడాలి. జనానికి తేడా తెలియదు. వాళ్లు చత్వార జీవులు, చెవిటి మేళాలు. శబ్దం గట్టిగా వుంటే మన స్వరమే పిడుగుగా భావిస్తారు.
మనం మూర్ఖులమనే విషయం మనకి తెలుసు. తెలిసినా తెలియనట్టుండాలి. అనాదిగా మూర్ఖులదే రాజ్యం. తెలివైన వాళ్లు మూర్ఖులకి బానిసలు. తెలివిని మన కోసం ఖర్చు పెట్టి చిల్లర డబ్బులు అడుక్కుంటారు. అజ్ఞానానికి మించిన రక్షణ, తెలివిని మించిన శాపం లేదు. అజ్ఞానాన్ని గుర్తిస్తే అది తెలివిగా మారిపోతుంది. గుర్తించకపోవడమే జ్ఞానుల లక్షణం.
అధికారం వచ్చే వరకూ సహనంగా వుండాలి. వచ్చిన తర్వాత రెండు కాళ్లు పైకెత్తి తన్నాలి. మన ప్రత్యేకత ఏమంటే రెండు కాళ్లు ఏకకాలంలో లేపగలగడం. ప్రత్యర్థులకి మాట్లాడే అవకాశం లేకుండా పళ్లు రాలేలా తన్నడాన్ని నిజమైన రాజకీయం అంటారు.
ప్రజలు గొర్రెలు. చర్మం వలిచి వాళ్లకే ఉన్ని శాలువాలు కప్పినా కనుక్కోలేరు. మేత మేపేది కోతకే అని తెలుసుకోలేరు. బిర్యానీ ఘుమఘుమని ఆస్వాదిస్తారే తప్ప ఉడుకుతున్నది తామే అని గుర్తించలేరు.
ఇక్కడ మన ప్రధాన అర్హత ఏమంటే నెమ్మది, నిదానం. ఏ పనినీ వేగంగా చేయకపోవడం. మాటలు వాయు వేగంతోనూ, చేతలు తాబేలు గమనంతోనూ వుండాలి. రాజకీయం అంటే అర్ధ సత్యం. సగం నిజం, సగం అబద్ధమే పాలన.
మనం గాడిదలని ఎవరూ గుర్తు పట్టకపోవడానికి వేషభాషలే కారణం. జనం మేకప్‌నే చూస్తారు తప్ప, లోపలున్న అసలు రూపాన్ని కాదు. నువ్వెవరో ఎవరికీ అక్కర్లేదు. నువ్వెలా కనిపిస్తున్నావో అది ముఖ్యం.
ఎవడికీ అర్థం కాని భాష మాట్లాడు. అర్థం లేకుండా మాట్లాడే వాడే మేధావిగా గుర్తింపు. గుప్పెట్లో చురకత్తి దాచి స్నేహ హస్తం చాచు. వ్యక్తిగా మిగలకపోవడమే సిసలైన వ్యక్తిత్వం”
క్లాస్ ముగిసింది. ఓండ్ర ధ్వానాలు మిన్నుముట్టాయి. ఔత్సాహిక గుర్రం తెచ్చి పెట్టుకున్న జ్ఞానంతో రెండు వెనుక కాళ్లు జోడించి నాలుగు గాడిద ప్రేక్షకుల్ని తన్నింది. అందరి కోసం పెట్టిన గుగ్గిళ్లని ఒక్కటే తినేసింది.
తినడం, తన్నడం ప్రాథమిక అర్హతలుగా భావించి గుంపులో చేర్చుకున్నారు.
జీఆర్ మహర్షి