ఇప్పుడు రాజకీయాల్లో ట్రెండ్ మారిపోయింది. తాము చేసిన పనిని పొగుడుకుంటూ డప్పు కొట్టుకోవడం మాత్రమే కాదు. ప్రతిసారీ.. తమ ప్రత్యర్థుల పాలన మీద నిందలు మోపి ఆనందించడం ఒక ట్రెండ్ అయిపోయింది.
ఏదో ఒక సందర్భంలో ప్రత్యర్థి పార్టీ మీద నిందలు వేయడం మామూలే.. కానీ.. ఏ చిన్న పని చేసినా.. ప్రతిసారీ తమ వ్యతిరేకుల మీద, వారి పరిపాలన మీద నిందలు వేస్తూ కలకాలం బతికేయాలనుకోవడం నయా ట్రెండ్. నరేంద్రమోడీ ప్రధానిగా ఈ నయా విద్యలో మాస్టర్ కోర్సు చేసిన నాయకుడు.
పదేళ్లుగా ఆయనే పరిపాలిస్తున్నా కూడా.. ఇప్పటికీ ఏ చిన్న పనిచేస్తున్నా నెహ్రూ కాలం నాడు ఇలా జరిగిందని, దేశాన్ని భ్రష్టుపట్టించారని అంటుంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా.. మోడీ బాటనే ఫాలో అవుతున్నట్టుంది. జగన్ ను కాదని ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. ఇంకా చంద్రబాబు జగన్ వైఫల్యాలను ఏకరవు పెట్టడం అనవసరం. అయితే.. ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలో తొలిసారిగా పెన్షన్లు ఇవ్వబోతున్న సమయంలో జగన్ ను విలన్ గా చిత్రీకరించేందుకు ఎక్కువ ప్రయాస పడుతున్నారు.
పెన్షన్ల లబ్ధిదారులు అతిపెద్ద ఓటు బ్యాంకుగా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నారు. పెంచదలచుకున్న వెయ్యి రూపాయల పెన్షనును అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచేస్తే.. అయిదేళ్ల తరవాత మళ్లీ ఎన్నికల నాటికి వారిని ఆకట్టుకోవడం ఎలా అనే భయం బాబుకు ఇప్పటి నుంచీ ఉంది. దానికి సమాధానం దొరక్క.. జగన్ ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి 48 నెలల పాటూ పెన్షన్లను చాలా పద్ధతిగా ఇళ్ల వద్దకే అందించే ఏర్పాటుచేయగా.. ఎన్నికల ముందు కుట్ర పన్నిన తెలుగుదేశం దళాలు.. పితూరీలు పెట్టించి.. వాలంటీర్లను దూరం పెట్టించి.. పెన్షనర్లకు ద్రోహంచేశారు. సచివాలయాల వద్దకు రావడానికి, బ్యాంకుల చుట్టూ తిరగడానికి అనేక పాట్లు పడ్డారు.
అంత యాతన పెట్టించి.. అదంతా జగన్ పాపం అని తేల్చేస్తూ.. ఆ సమయంలో వృద్ధుల పాట్లు చూసి తనకు మనసు కరిగిపోయిందని చంద్రబాబు బహిరంగ లేఖ రాయడమే కామెడీ. నిందలు మాని తమ పనితాము చేసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.