వీధుల్లోకి పెద్దామె.. లోకేశ్ దంప‌తులు ఏం చేస్తున్న‌ట్టు?

కాలం ఎప్పుడూ ఒక‌రి ప‌క్షానే వుండ‌దు. ప్ర‌కృతి నియ‌మావ‌ళి ప్ర‌కారం ఎవ‌రికైనా ఒక స‌మ‌యం వ‌స్తుంటుంది. ఆ స‌మ‌యంలో వారి హ‌వా సాగుతుంటుంది. స‌ర్వ‌స్వం తానే అని చెప్పుకున్న శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు కూడా కౌర‌వుల…

కాలం ఎప్పుడూ ఒక‌రి ప‌క్షానే వుండ‌దు. ప్ర‌కృతి నియ‌మావ‌ళి ప్ర‌కారం ఎవ‌రికైనా ఒక స‌మ‌యం వ‌స్తుంటుంది. ఆ స‌మ‌యంలో వారి హ‌వా సాగుతుంటుంది. స‌ర్వ‌స్వం తానే అని చెప్పుకున్న శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు కూడా కౌర‌వుల మాతృమూర్తి గాంధారి శాపం నుంచి త‌ప్పించుకోలేక‌పోయారు. త‌న వంశాన్ని నాశ‌నం చేయ‌డానికి శ్రీ‌కృష్ణుడే ప్ర‌ధాన కార‌కుడ‌ని భావించిన గాంధారి, అందుకు మూల్యం చెల్లించాల్సిందేన‌ని.. దాయాదులైన యాద‌వులు వాళ్ల‌లో వాళ్లే కొట్టుకుని, కౌర‌వుల మాదిరే నాశ‌నం అవుతార‌ని, అది చూసి కుమిలికుమిలి ఏడుస్తావ‌ని గాంధారి శ‌పించారు. అంతేకాదు, నీ ద‌గ్గ‌ర ఎవ‌రూ లేని స‌మ‌యంలో దిక్కుమాలిన చావు చ‌స్తావ‌ని శ్రీ‌కృష్ణుడిని గాంధారి పుత్ర‌శోఖంతో శ‌పిస్తారు. 

ఇప్పుడీ క‌థ ఎందుకంటే.. చంద్ర‌బాబు గురించి మాట్లాడుకోడానికే. 45 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో అవినీతికి పాల్ప‌డుతూ వ‌చ్చినా, త‌ప్పించుకుంటూ తానో నిప్పున‌ని ప్ర‌చారం చేసుకున్నారు. ఆయ‌న‌కు బాకా ఊదే మీడియా ఎటూ వుంది. చివ‌రికి వైసీపీ ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు చిక్కారు. నాలుగున్న‌రేళ్ల పాటు ఏమీ చేయ‌ని జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో అస‌లు ట‌చ్ చేయ‌ర‌ని టీడీపీ శ్రేణులు భావించాయి.

అంద‌రూ ఊహించిన‌ట్టు చేస్తే, అత‌ను వైఎస్ జ‌గ‌న్ ఎందుక‌వుతారు? చంద్ర‌బాబుకే పీడ‌క‌ల అనిపించేలా అరెస్ట్ చేసి, తీసుకెళ్లి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో పెట్టారు. ఇప్ప‌టికి 45 రోజులకు పైగా ఆయ‌న జైల్లో ఉన్నారు. ఇంకెంత కాలం వుంటారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో నిజం గెల‌వాలంటూ నారా భువ‌నేశ్వ‌రి బ‌స్సుయాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. భ‌విష్య‌త్‌కు గ్యారెంటీ పేరుతో లోకేశ్ కూడా బ‌స్సుయాత్ర చేస్తార‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను మూట‌క‌ట్టి ఎక్క‌డో విసిరేశారు. వార‌సుడైన లోకేశ్ య‌థేచ్ఛ‌గా తిరుగుతూ, త‌న త‌ల్లిని వీధుల్లోకి పంప‌డం విమ‌ర్శ‌ల‌కు గురి చేస్తోంది. అంతేకాదు, 60 ఏళ్ల‌కు పైబ‌డిన పెద్దామెను వీధుల్లోకి పంపి, లోకేశ్‌, ఆయ‌న భార్య బ్రాహ్మ‌ణి సేద‌దీర‌డం ఏంట‌ని టీడీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. యువ ర‌క్తం పొంగి పొర్లుతున్న లోకేశ్‌, బ్రాహ్మ‌ణి ధైర్యంగా జ‌నంలోకి వెళితే , ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. 

రాజ‌కీయాల‌తో సంబంధం లేని త‌ల్లిని రోడ్డెక్కించ‌డాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. రెండు రోజుల క్రితం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ స‌మ‌ర్థుడైతే త‌ల్లిని ఎందుకు రోడ్డెక్కిస్తార‌ని ప్ర‌శ్నించారు. భువ‌నేశ్వ‌రి బ‌దులు బ్రాహ్మ‌ణిని ప్ర‌జ‌ల్లోకి పంపి, మ‌రోవైపు తాను కూడా వెళ్లేందుకు లోకేశ్ ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. 

పెద్దామె భువ‌నేశ్వ‌రిని వీధుల్లో తిప్ప‌డం త‌మ‌కు కూడా ఇష్టం లేద‌ని, అయితే లోకేశ్‌, బ్రాహ్మ‌ణి ఎంత‌కూ ముందుకు రాక‌పోవ‌డంతోనే ఆమెను తిప్పాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. చిన్న వ‌య‌సులో కూడా లోకేశ్‌, బ్రాహ్మ‌ణి జ‌నం మ‌ధ్య‌కు వెళ్లి భ‌రోసా ఇవ్వ‌క‌పోతే, మ‌రెప్పుడు వెళ్తారోన‌ని టీడీపీ నేత‌లు నిట్టూర్చుతున్నారు. బాబు అరెస్ట్‌తో టీడీపీ క‌ష్ట‌కాలంలో వుంద‌ని, ఈ స‌మ‌యాన్ని రాజ‌కీయంగా అనుకూలంగా మ‌లుచుకోవాల్సిన లోకేశ్ దంప‌తులు, ఆ ప‌ని చేయ‌కుండా మిగిలివ‌న్నీ చేస్తున్నార‌ని టీడీపీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నాయి.