స్టీల్ ప్లాంట్ ముసుగులో పవన్ ఢిల్లీ టూర్?

పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారొహో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడేస్తారొహో.. పెద్దాయన్ని నయానో భయానో ఒప్పించి, కుదరకపోతే మీతో కటీఫ్ అని చెప్పేసి వచ్చేస్తారొహో.. ఇవీ జనసేన సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న స్లోగన్లు.…

పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారొహో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడేస్తారొహో.. పెద్దాయన్ని నయానో భయానో ఒప్పించి, కుదరకపోతే మీతో కటీఫ్ అని చెప్పేసి వచ్చేస్తారొహో.. ఇవీ జనసేన సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న స్లోగన్లు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాయి ఎంత?

వారికొచ్చిన సీట్లు ఎన్ని?  స్టీల్ ప్లాంట్ పక్కన గాజువాకలో పవన్ కి వచ్చిన ఓట్లు ఎన్ని? ఇవేవీ చూడకుండానే పవన్ కల్యాణ్ కి స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోదీ హామీ ఇచ్చేస్తారా? నాలుగు పార్టీలు మారి, నలుగురి నాయకుల కింద నలిగి, డక్కామొక్కీలు తిన్న గంటా సైతం.. రాజీనామా డ్రామాను సరిగ్గా నడపలేక సతమతం అవుతున్నారు. అలాంటిది పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ అనగానే జనసేనాని సత్తా చూపించే టైమ్ వస్తుందని జనం ఆశపడతారా?

రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ వేడి రాజుకున్న నేపథ్యంలో.. దీన్ని సాకుగా చెబుతూ పవన్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. నిజంగానే ఆయన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారా.. లేక తన రాజకీయాలు, తిరుపతి సీటు గురించి మాట్లాడుకొని వస్తారా? అనేది అంతర్గత రాజకీయ వ్యవహారం. 

లోపల కాళ్లు పట్టుకుని, బయటకొచ్చాక తొడగొట్టడం చంద్రబాబు దగ్గర పవన్ నేర్చుకునే ఉంటారు. అందుకే గత ఢిల్లీ పర్యటనల్లో కూడా చర్చల ద్వారా తిరుపతి అభ్యర్థిని ఎంపిక చేస్తామంటూ చెప్పి సైలెంట్ గా వచ్చేశారు. ఇప్పుడు కూడా లోపల ఏం జరిగినా.. బయటకొచ్చి స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారని రెడీమేడ్ డైలాగ్ కొట్టేస్తారు.

లెటర్ రాసే ధైర్యం లేని పవన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు..

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే  జనసేన తరపున ఓ ప్రకటన విడుదలైంది. ప్రైవేటీకరణకు మేం ఒప్పుకోం, ప్రధాని దీనిపై ప్రకటన చేసేలా ఒత్తిడి తెస్తాం, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు… అంటూ విడుదలైన ఆ ప్రకటన పవన్ కల్యాణే ఇచ్చారని అనుకున్నారంతా. 

కానీ ఆయనకంత ధైర్యం లేదని, ఏవో జయంతులు, వర్థంతులకు.. మాత్రమే ఆయన తన పేరు వాడుకుంటారని, బీజేపీకి కోపం తెప్పించే ఏ ప్రకటనలోనూ ఆయన పేరు వేసుకోరని జనసైనికులు కాస్త  ఆలస్యంగా తెలుసుకున్నారు.

తీరా ఇప్పుడు నాదెండ్లతో సహా ఆయన ఫ్లైటెక్కేశారు. అక్కడ ఎవరెవర్ని కలుస్తారనే విషయంపై జనసేన అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా.. యధావిధిగా పవన్ కి ఎప్పుడూ అపాయింట్ మెంట్ ఇచ్చే జేపీ నడ్డాతో భేటీ ఉంటుందని అంటున్నారంతా. కుదిరితే అమిత్ షా, అన్నీ కుదిరితే ప్రధాని మోదీతో భేటీ ఉండే అవకాశం ఉంది.

వాస్తవానికి స్టీల్ ప్లాంట్ విషయంలోనే కాదు, కనీసం తిరుపతి సీటు విషయంలో కూడా బీజేపీని దబాయించే దమ్ము, ధైర్యం పవన్ కల్యాణ్ కి లేదు. రాగా పోగా.. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని తిరుపతి సీటు గురించి మరింత ఎక్కువగా బతిమిలాడే అవకాశం పవన్ కి దొరికినట్టయింది. 

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికే పవన్ ఢిల్లీబాట పట్టారు. స్టీల్ ప్లాంట్.. స్టీల్ ప్లాంట్ అనుకుంటూ లోపలికి వెళ్లి, తిరుపతి.. తిరుపతి అంటూ చర్చలు జరిపి..  బయటికొచ్చేటప్పుడు తిరిగి యథావిధిగా స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ అనుకుంటూ వచ్చేస్తారు పవన్.

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి.. 

ఆ కలాల వెనుక కులాల ఎజెండా