తెలంగాణ ప‌ల్స్ ఏమంటోంది?

నవంబ‌ర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌బోతోంది. బ‌రిలోని అభ్య‌ర్థులు అమీతుమీ త‌ల‌ప‌డుతున్నారు! అధికారాన్ని మ‌రోసారి నిల‌బెట్టుకోవ‌డానికి బీఆర్ఎస్, ద‌శాబ్ద‌కాలం త‌ర్వాత అయినా అధికారం రుచిని మ‌ళ్లీ చూడ‌టానికి కాంగ్రెస్ పార్టీ, సౌత్…

నవంబ‌ర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌బోతోంది. బ‌రిలోని అభ్య‌ర్థులు అమీతుమీ త‌ల‌ప‌డుతున్నారు! అధికారాన్ని మ‌రోసారి నిల‌బెట్టుకోవ‌డానికి బీఆర్ఎస్, ద‌శాబ్ద‌కాలం త‌ర్వాత అయినా అధికారం రుచిని మ‌ళ్లీ చూడ‌టానికి కాంగ్రెస్ పార్టీ, సౌత్ లో క‌నీసం తెలంగాణ‌లో అయినా ఉనికిని చాటుకోవ‌డానికి భార‌తీయ జ‌నతా పార్టీ ఆరాట‌ప‌డుతూ ఉన్నాయి. అభ్య‌ర్థులు క్షేత్ర స్థాయిలో విజ‌యం కోసం శ్ర‌మిస్తున్నారు. పార్టీలు అస్త్ర‌శ‌స్త్రాల‌నూ ఉప‌యోగిస్తూ ఉన్నాయి. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ధ‌న ప్ర‌భావం కూడా గ‌ట్టిగా ఉంటుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలు లెక్క చేయ‌కుండా లెక్క ఖ‌ర్చు పెట్ట‌డానికి రెడీగా ఉన్నాయి. ఓటు  రేటును ఏ స్థాయిలో అయినా క‌ట్టే స్థాయి అన్ని పార్టీల‌కూ ఉంది. మ‌రి కేవ‌లం ధ‌న‌మే కాకుండా.. ఐదేళ్ల రాజ‌కీయం ఆధారంగా కూడా ఓట్లు ప‌డ‌తాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

పార్టీలు డ‌బ్బు ఇస్తే ప్ర‌జ‌లు కాద‌నే ప‌రిస్థితి లేదు. తీసుకుంటారు. తీసుకున్నంతా తీసుకుని.. తాము ఓటేయాల‌నుకునే పార్టీకే వారు ఓటేసేలా మారారు. భార‌త ప్ర‌జాస్వామ్యంలో వ‌చ్చిన ప‌రిణ‌తి ఇది. ఓటుకు డ‌బ్బు తీసుకోవ‌డం ఎవ్వ‌రూ చిన్న‌త‌నంగా భావించ‌డం లేదు. ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కూ అయినా కొంద‌రు చిన్న‌త‌నం అనుకునే వారేమో! అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఏదో ర‌కంగా ప్ర‌తి ఓటు మీదా ప్ర‌తి పార్టీ అభ్య‌ర్థీ డ‌బ్బు ఖ‌ర్చు పెడుతూనే ఉన్నాడు. దీనికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఏ మాత్రం మిన‌హాయింపు కాదు!

మ‌రి పోలింగ్ కు రెండు వారాల్లోపు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో.. తెలంగాణ ప‌ల్స్ ఏమంటోంద‌నే వాక‌బు చేస్తే.. ధ‌న ప్ర‌భావం కూడా గ‌ట్టిగానే ఉండ‌బోతోంద‌నే మాట వినిపిస్తూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి కొన్ని స్ట‌డీస్ ను గ‌మ‌నిస్తే.. సీట్ల విష‌యంలో ఏ పార్టీ స్థాయి ఏమిట‌నే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ కు రెండు వారాల ముందు ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డానికి జ‌రిగిన ఈ అధ్య‌య‌నంలో ఆస‌క్తిదాయ‌క‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి!

ఒక్క మాట‌లో చెప్పాలంటే తెలంగాణ బ‌రిలో కాంగ్రెస్ పార్టీ ముందు దూసుకుపోతోంది! ఆ పార్టీకి చావోరేవోలాంటి ఈ ఎన్నిక‌లో ర‌క‌ర‌కాల అంశాలు దానికి క‌లిసి వ‌స్తున్నాయి. ఫ‌లితంగా 45 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంద‌నేది ఈ అధ్య‌య‌న సారాంశం! ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం న‌మోదు చేసే అవ‌కాశాలు ఎక్క‌వ‌గా ఉన్నాయి! మ‌రి అధికార సంపాద‌న‌కు ఈ సీట్లు స‌రిపోవు! అయితే కాంగ్రెస్ ద్వారాలు ఇంత‌టితో మూసుకుపోవ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీ ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గాలు మరిన్ని ఉన్నాయి. క‌నీసం 45 సీట్ల‌లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవ‌కాశాలున్నాయ‌ని, పోటీ ఇచ్చే ప‌రిస్థితి మ‌రిన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంద‌నేది ఈ అధ్య‌య‌న సారాంశం!

మ‌రి భార‌తీయ రాష్ట్ర స‌మితి పార్టీ ప‌రిస్థితి ఏమిటంటే.. ఎన్నిక‌ల వేళ ఆ పార్టీ జోష్ త‌గ్గింద‌ని అంటోంది ఈ అధ్య‌య‌నం. బీఆర్ఎస్ ఖాయంగా గెలుపు సాధించే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 25 మాత్ర‌మే అనే షాకింగ్ రిజ‌ల్ట్ ను ఈ అధ్య‌య‌నం ఇస్తోంది! గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కాంగ్రెస్, టీడీపీలు క‌లిసి పోటీ చేయ‌డం ఆ పార్టీకి క‌లిసొచ్చింది. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డుతూ కేసీఆర్ రెచ్చిపోయారు. ఒక‌వేళ కాంగ్రెస్ కు టీడీపీతో పొత్తు లేక‌పోతే కేసీఆర్ కు అలాంటి అస్త్రం ఒక‌టి ల‌భించేది కాదు. అలా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేజేతులారా కేసీఆర్ కు మంచి అవ‌కాశాలు ఇచ్చింది. అందుకు ఫ‌లితాన్ని అనుభ‌వించింది. ఇప్పుడు కాంగ్రెస్ హామీల గురించి బీఆర్ఎస్ మాట్లాడాల్సి వ‌స్తోంది!

ఇక మొన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ‌లో త‌దుప‌రి అధికారం త‌మ‌దే అని చెప్పుకున్న బీజేపీ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది. కేవ‌లం ఐదంటే ఐదు స్థానాల్లో మాత్ర‌మే క‌మ‌లం పార్టీకి ఊపు ఉంద‌నేది ఈ అధ్య‌య‌న సారాంశం! అధికారం త‌మ‌దే అనే స్థాయి నుంచి ఐదు స్థానాల్లో మాత్ర‌మే గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితి ఉంద‌ట క‌మ‌లం పార్టీకి! బీజేపీ గ‌నుక ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజ‌యానికి ప‌రిమితం అయితే అంత‌కు మించిన ఫెయిల్యూర్ స్టోరీ ఉండ‌దు. ఇదే ఫ‌లిత‌మే వ‌స్తే స‌మీప భ‌విష్య‌త్తుల్లో తెలంగాణ‌లో బీజేపీ కి చీక‌టి రోజులే మిగులుతాయి!

ఇక ఎంఐఎం త‌న ఏడు స్థానాల స్థాయిని మించ‌డం కానీ, త‌గ్గ‌డం కానీ జ‌ర‌గ‌ద‌నేది ఈ అధ్య‌య‌న సారాంశం!

వీట‌న్నిటి క‌న్నా ఆస‌క్తిదాయ‌కంగా 37 సీట్ల‌లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని ఈ అధ్య‌య‌నం చెబుతోంది. ఈ పోటీ ప్ర‌ధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మ‌ధ్య‌నే! ఈ రెండు పార్టీల్లో ఈ 37 సీట్ల‌లో ఎవ్వ‌రు విజ‌యం సాధిస్తే వారిదే అధికారం అవుతుంది. బీఆర్ఎస్ ఖాయంగా గెల‌వ‌గ‌ల సీట్లు  25, దానికి తోడు ఈ 37 సీట్ల‌లోనూ గెలిస్తే.. అప్పుడు ఆ పార్టీని ఎవ్వ‌రూ ఆప‌లేరు! ఈ ముప్పై ఏడు సీట్ల‌లో గ‌ట్టి పోటీ ఉంది. వీటిల్లో గ‌నుక బీఆర్ఎస్ త‌న స‌త్తా చూపిస్తే.. నిస్సందేహంగా ఆ గులాబీ పార్టీదే అధికారం. అయితే ఇదే సీట్ల‌లో కాంగ్రెస్ నుంచి కూడా గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది. కాంగ్రెస్ ఖాయంగా గెల‌వ‌గ‌ల 45 సీట్ల‌కు తోడు.. ఈ ముప్పై ఏడు సీట్ల‌లో క‌నీసం 16 స్థానాల్లో విజ‌యం సాధించినా ఆ పార్టీకి మినిమం మెజారిటీ ద‌క్క‌డం ఖాయ‌మ‌నేది ఈ స‌ర్వే వేస్తున్న అంచనా!

అంటే గ‌ట్టి పోటీ ఇచ్చే సీట్ల‌లో బీఆర్ఎస్ క‌నీసం 35 సీట్ల‌ను గెల‌వాలి, అదే కాంగ్రెస్ పార్టీ క‌నీసం 16 స్థానాల్లో నెగ్గినా అధికారానికి ఆ పార్టీ చేరువ అవుతుంద‌ని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది. అంటే ఓవ‌రాల్ గా ప్రస్తుతానికి కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉంద‌నేది ఈ అధ్య‌య‌న సారాంశం.

మ‌రో విశేషం ఏమిటంటే గ‌ట్టి పోటీ ఉన్న 37 సీట్ల‌లో డ‌బ్బు కూడా కీల‌క పాత్ర పోషిస్తుంద‌నేది. ఈ ముప్పై ఏడు సీట్ల‌లో పార్టీలు ఎంత వెద‌జ‌ల్లితే అంత అవ‌కాశం ఉన్న‌ట్టు! ప్ర‌జ‌లు కూడా అదే రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నార‌ట‌! ఓటుకు ఎంతి చేతికిస్తార‌నే దాన్ని బ‌ట్టి వారు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని ఈ స‌ర్వే అంటోంది.  

ఐదు స్థానాల్లోనే లీడ్ ఉన్నా బీజేపీ ప‌రిస్థితి ఓటు షేర్ విష‌యంలో కాస్త మెరుగైంద‌ని ఈ అధ్య‌య‌నం అంటోంది. ఆ పార్టీ ఓవ‌రాల్ గా ప‌న్నెండు నుంచి 15 శాతం ఓట్ల‌ను సంపాదించుకునే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది.

కేసీఆర్ ప్ర‌భుత్వం గ‌ట్టి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంద‌ని ఈ స‌ర్వే చెబుతున్న మాట‌! కాంగ్రెస్ కు ఒక అవ‌కాశం ఇద్దామ‌నే భావ‌న కూడా తెలంగాణ ప్ర‌జానీకంలో ఉంద‌ట‌! బీఆర్ఎస్ సిట్టింగుల‌పై ఉన్న వ్య‌తిరేక‌త కూడా త‌క్కువ కాద‌నేది ఈ స‌ర్వే మాట‌! కాంగ్రెస్ పార్టీ ప‌న్నిన ఉచ్చులో కూడా బీఆర్ఎస్ చిక్కుకుంద‌నే మాటను చెబుతోంది ఈ అధ్య‌య‌నం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక‌టే అనే అభిప్రాయాలు కూడా నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతున్నాయ‌ట‌! ఓవ‌రాల్ గా ఇదీ ఒక స‌ర్వే చెబుతున్న అంశం. మ‌రి పోలింగ్ కు ఇంకా స‌మ‌యం అయితే ఉంది. ఆ లోపు జ‌రిగే ప‌రిణామాలు ఫ‌లితాల‌ను ఏ ర‌కంగా ప్ర‌భావితం చేస్తాయో!