పవన్ బంధంతో కమలానికి ఒరిగేదేమిటి?

పవన్ కల్యాణ్ తో పొత్తు బంధం కుదుర్చుకున్నంత మాత్రాన.. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీకోసం బిజెపి నుంచి కొన్ని…

పవన్ కల్యాణ్ తో పొత్తు బంధం కుదుర్చుకున్నంత మాత్రాన.. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీకోసం బిజెపి నుంచి కొన్ని సీట్లు పుచ్చుకుని, అక్కడ తమ అభ్యర్థులను మోహరించి.. మిగిలిన చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో కమలానికి అనుకూలంగా ప్రచారం నిర్వహించినంత మాత్రాన బిజెపి గెలిచిపోతుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

వవన్ కల్యాణ్ తో బంధం కోసం భాజపా ఎందుకు అంతగా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదని కమలం పార్టీ నాయకులు కూడా విస్తుపోతున్నారు. ఎన్నికల్లో పార్టీ  ఇమేజిని దిగజారుస్తున్న వ్యూహాల్లో ఇది కూడా ఒకటి అవుతుందేమోనని భయపడుతున్నారు. 

తెలంగాణలో అంతో ఇంతో పార్టీకి పట్టు ఉంది. ఇంకాస్త బలంగా వర్కవుట్ చేసుకుంటే.. ఈ ఎన్నికల్లో దెబ్బతిన్నా సరే.. మరోసారి ఎన్నికల్లోగా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందని , పవన్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల.. పార్టీ సొంతంగా బలపడే వాతావరణం కూడా దెబ్బతింటుందని వారు భయపడుతున్నారు.

పవన్ కల్యాణ్ కు గానీ, జనసేన పార్టీకి గానీ.. తెలంగాణలో ఉన్న ఆదరణ సున్నా. ఏపీలోనే ఆ పార్టీకి దిక్కులేదని 2019 ఎన్నికలు తేల్చాయి. ఇక తెలంగాణలో అసలు పట్టించుకునే వారు లేరు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను దించితే డిపాజిట్లు దక్కలేదు. పోనీ గత ఎన్నికల తర్వాతనైనా.. ఏపీ తరహాలో.. తన ప్రజాదరణను పెంచుకోడానికి ఎన్నడైనా ప్రయత్నించారా? అంటే అది కూడా లేదు. 

ప్రభుత్వం తీరు మీద ఎన్నడైనా విమర్శలు చేశారా? అంటే అది కూడా లేదు. తెలంగాణలో ప్రజల కష్టాల గురించి కనీసం మాటమాత్రమైనా ప్రస్తావించారా అంటే లేదు! ఇలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎన్నికలు రాగానే తగుదునమ్మా అంటూ ఎగబడి వస్తే జనం ఆదరిస్తారా? అనేది పలువురి సందేహం.

నిజానికి పార్టీ నాయకత్వం ఎగబడుతున్నది గానీ.. కమలం పార్టీ స్థానిక నాయకుల్లో భయం భయంగానే ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని ఏ రకంగా నాశనం అయిపోయిందో.. ఈసారి పవన్ తో పొత్తు పెట్టుకుంటే తమ పరిస్థితి కూడా అంతే అవుతుందని అనుకుంటున్నారు. 

పవన్ తో పొత్తు వలన.. కేసీఆర్ చేతికి తమను తిట్టిపోయడానికి అనువైన గొప్ప అస్త్రాలను అందించినట్లు అవుతుందని కూడా అనుకుంటున్నారు. మరి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో కూడా భేటీ అయిన నేపథ్యంలో పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి.