మహారాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు జరుగుతున్నాయి. ఎన్సీపీ చీలిక తర్వాత- పార్టీ అధికారికంగా ఎవరిది అనే విషయంలో ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మద్దతు తమకే ఉన్నది గనుక అధికారిక ఎన్సీపీ గా తమనే గుర్తించాలని అజిత్ పవార్ వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అదే సమయంలో ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని శరద్ పవార్ వర్గం ఈసీ ఎదుట కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తానికి ఎన్సీపీ రాజకీయం శరద్ పవార్ వయసు చుట్టూ తిరుగుతోంది.
సీనియర్ నాయకుడు శరద్ పవార్ వయసు ఇప్పుడు 82 ఏళ్లు. ఒకవైపు రాజకీయాల్లో ఉన్న తమ నాయకులు 75 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఒక అలిఖిత నైతిక సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ అమలులోకి తీసుకువచ్చింది. పదవిలో ఉండగా 75 ఏళ్లు దాటిన నాయకులకు ఆ తర్వాతి నుంచి అవకాశం లేకుండా కేవలం పార్టీ సేవలకు మాత్రం వాడుకుంటూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సంస్కృతిని ప్రత్యేకంగా ప్రస్తావించిన అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ కు కూడా అదే సలహా ఇచ్చారు. వయసు మీరిన తర్వాత తమరు ఇంట్లో కూర్చోవచ్చు కదా అనే వాదన తెరమీదకి తెచ్చారు. ఈ వాదన శరద్ పవార్ ఈగోను దెబ్బకొట్టినట్టుగా కనిపిస్తోంది.
దీనికి కౌంటర్ గా శరద్ పవార్ పార్టీ కీలక నాయకుల భేటీ ఏర్పాటు చేసి.. వయసు మీరు పోయినంత మాత్రాన తనకేమీ ఢోకా లేదని తాను ఇంకా అద్భుతంగా పనిచేయగల స్థితిలో ఉన్నానని చెప్పుకున్నారు. తమాషా ఏమిటంటే ఇదే శరద్ పవార్ కొన్ని నెలల కిందట వార్ధక్యం కారణంగా పార్టీకి సారథ్యం వహించే స్థితిలో లేనని బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటానని ప్రకటించిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అప్పట్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కన్నీళ్లు పెట్టుకుని బతిమాలడంతో.. తిరిగి పగ్గాలు తన చేతిలోనే పట్టుకోవడానికి ఒప్పుకున్నారు. తర్వాతి పరిణామాల్లో కార్యనిర్వాహక అధ్యక్షులుగా తన కూతురు సుప్రియా సూలే ను, ప్రఫుల్ పటేల్ ను నియమించారు.
అజిత్ ఆగ్రహానికి, చీలికకు మూలం ఇక్కడే ఉంది. సదరు ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ వర్గంలోకి ఫిరాయించడం ఒక ట్విస్టు. తాను స్వచ్ఛందంగా పార్టీని వదులుకోవడానికి సిద్ధపడిన ఆయన, పార్టీ నాయకులు తిరుగుబాటు చేసి తనను దూరం పెట్టడాన్ని మాత్రం సహించలేకపోతున్నారు.
అజిత్ పవార్ నేతృత్వంలో చీలిక వర్గమే అధికారికమైనదిగా గుర్తించడానికి ఆయన ఇంకా నలుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉన్నారు. శరత్ పవార్ వెంట ఉన్న 17 మంది ఎమ్మెల్యేలలో నలుగురిని ఫిరాయింపజేయగలిగితే అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీని మొత్తంగా తన చేజిక్కించుకున్నట్లు అవుతుంది. మహా రాజకీయ యవనికపై నడుస్తున్న ఈ ఇంటిపోరులో విజయం ఎవరిదో వేచి చూడాలి.