విశాఖ ఎంపీ సీటు అందరికీ వెరీ స్వీట్ గానే ఉంటుంది. విశాఖ జనాలు చాలా మంచివారు ఎవరు వచ్చి పోటీ చేసినా ఓట్లు వేస్తారు. కూల్ ప్లేస్. జనాలు కూడా శాంత స్వభావులు. అందువల్లనే గత మూడున్నర దశాబ్దాల కాలంలో అంతా నాన్ లోకల్స్ విశాఖ ఎంపీలుగా అయ్యారు.
ఇపుడు కూడా విశాఖ సీటు కోసం నాన్ లోకల్స్ మధ్యనే పోరు సాగుతోంది. వైసీపీ సైతం నాన్ లోకల్స్ కే గత రెండు టెర్మ్ లలో టికెట్ ఇచ్చింది. టీడీపీ అయితే మొదటి నుంచి అదే బాట పట్టి ఉంది. బీజేపీ సైతం నాన్ లోకల్స్ నే నమ్ముకుంటోంది.
బీజేపీలో విశాఖ ఎంపీ సీటు కోసం ఇద్దరు నాన్ లోకల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉందా అని రాజకీయ వర్గాలలో సందేహం కలుగుతోంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్ గా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు.
జీవీఎల్ సీటు కోసం దూకుడు పెంచారని అంటున్నారు. ఆయన గురువారం తన పుట్టిన రోజు వేడుకలను విశాఖలో మొదటిసారిగా జరుపుకున్నారు. జీవీఎల్ టీం పేరిట ఆయన అభిమానులు చేసిన హడావుడి చూస్తే ఆయనే ఎంపీనా అన్న డౌట్లు వచ్చేశాయి. విశాఖ సిటీ నిండా జీవీఎల్ ఫ్లెక్సీలతో నింపేసారు. విశాఖ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నట్లుగా అభిమానులు అందులో కీర్తించారు.
విశాఖ నుంచి 2024లో ఎన్నికల్లో జీవీఎల్ పోటీ చేయాలని, కేంద్రంలో మంత్రి కావాలని ఆయన ఫ్యాన్స్ చాలా పెద్ద కోరికలనే కోరుకుంటున్నారు. 2024 మొదట్లో జీవీఎల్ రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. ఆయన పార్లమెంట్ లో ఉండాలంటే విశాఖ నుంచే పోటీ చేస్తేనే సాధ్యమని భావిస్తున్నారు అని అంటున్నారు. పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీకి పట్టుదలగా ఉన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ హై కమాండ్ కి విశాఖ సీటు అగ్ని పరీక్షగా మారుతుంది అంటున్నారు.