ఇద్ద‌రితోనూ చెట్ట‌ప‌ట్టాల్‌!

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తుంద‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తే కొపం రావ‌చ్చు కానీ, ఆ పార్టీ చేష్ట‌లు అట్లే ఉన్నాయి. క‌నీసం ఒక నీతి, నియ‌మావ‌ళి లేని పార్టీ ఏదైనా వుందంటే… అది కేవ‌లం జ‌న‌సేన…

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తుంద‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తే కొపం రావ‌చ్చు కానీ, ఆ పార్టీ చేష్ట‌లు అట్లే ఉన్నాయి. క‌నీసం ఒక నీతి, నియ‌మావ‌ళి లేని పార్టీ ఏదైనా వుందంటే… అది కేవ‌లం జ‌న‌సేన మాత్ర‌మే. సిద్ధాంతం, ఒక ప‌ద్ధ‌తి లేకుండా ఇత‌ర పార్టీల‌తో అంట‌కాగుతున్న త‌న పార్టీని చూసి జ‌నం అస‌హ్యించుకుంటార‌నే స్పృహ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో లేదు. ప‌వ‌న్‌కు త‌గిన‌ట్టుగానే, ఆయ‌న పార్టీ నేత‌లు కూడా అన్నీ వ‌దిలేసి తిరుగుతున్నార‌నే విమ‌ర్శ‌కు గురి అవుతున్నారు.

తెలంగాణ‌లో బీజేపీతో, ఏపీలో టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 8 స్థానాల్లో పోటీ కూడా చేస్తోంది. జ‌న‌సేనను ఎన్డీఏ భాగ‌స్వామిగా తెలంగాణ బీజేపీ నేత‌లు చెబుతున్నారు. అలాంట‌ప్పుడు ఏపీలో కూడా అదే సూత్రం వ‌ర్తిస్తుంది క‌దా?  మ‌రెందుక‌ని బీజేపీని కాద‌ని టీడీపీతో పొత్తు పెట్టుకుంద‌నే ప్ర‌శ్న‌కు ఆ పార్టీ నేత‌ల నుంచి స‌మాధానం రాదు.

కానీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్తామ‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇవాళ తూర్పుగోదావ‌రి జిల్లాలో పురందేశ్వ‌రి ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌డియం మండ‌లం బుర్రిలంక ఇసుక ర్యాంపుల‌ను ఆమె ప‌రిశీలించారు. పురందేశ్వ‌రి వెంట తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడు కందుల దుర్గేశ్ పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

ఒక వైపు టీడీపీ, మరోవైపు బీజేపీతో క‌లిసి జ‌న‌సేన రాజ‌కీయ ప్ర‌యాణం సాగించ‌డం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తోంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. పురందేశ్వ‌రి పేరుకు బీజేపీ త‌ప్ప‌, ఆమె టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ప‌ని చేస్తున్నార‌ని, అందుకే ఆమె వెంట జ‌న‌సేన నాయ‌కుడు కందుల దుర్గేశ్ న‌డిచార‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. 

ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్తామ‌ని పురందేశ్వ‌రి మాట‌ల అర్థం, తాను టీడీపీ నాయ‌కురాలిన‌ని ప‌రోక్షంగా చెబుతున్నార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య నీతిమాలిన క‌ల‌యిక చోటు చేసుకుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.