కమ్యూనిస్టు యోధులను శాశ్వతం చేసిన రేవంత్ !

సాధారణంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెసుకు పడదు. సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. కాకపొతే బీజేపీ మీద పోరాడటానికి కలిసి పనిచేస్తుంటారు. తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ అంటే సీపీఐ చీలిపోయి…

సాధారణంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెసుకు పడదు. సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. కాకపొతే బీజేపీ మీద పోరాడటానికి కలిసి పనిచేస్తుంటారు. తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ అంటే సీపీఐ చీలిపోయి సీపీఎం ఏర్పడింది. కాలక్రమంలో విప్లవ పార్టీలుగా, గ్రూపులుగా ఏర్పడింది.

సీపీఐ, సీపీఎం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను అనుసరించగా, మిగిలినవి సాయుధ విప్లవ పార్టీలుగా, నక్సలైట్ పార్టీలుగా రూపాంతరం చెందాయి. బేసిగ్గా అయితే అన్ని కమ్యూనిస్టు పార్టీలే. నిజాం రాజు పాలనలో రజాకార్ల మీద తిరుగుబాటు చేసింది కమ్యూనిస్టులే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో చాలా గొప్ప పోరాటం. ఎందరో అమరులయ్యారు.

కానీ కాలక్రమంలో అనేక కారణాలతో కమ్యూనిస్టుల ప్రాబల్యం మసకబారింది. కమ్యూనిస్టు పార్టీల చరిత్ర ఎంత చెప్పుకున్నా తరగదు. ఇప్పడు తెలంగాణలో సీపీఐ పార్టీ కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఒక సీటు గెలుచుకుంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తాను కేసీఆర్ ను మించిన తెలంగాణా వాదినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను తగిన విధంగా గౌరవిచలేదనే విమర్శలు, వారికి సముచిత స్థానం ఇవ్వలేదనే విమర్శలు కేసీఆర్ మీద ఉన్నాయి. రాష్ట్రం కోసం పోరాడినవారిని పట్టించుకోలేదనే అపప్రథ ఆయన మీద ఉంది. ఇది వాస్తవం కూడా. ఇది రేవంత్ కు కలిసి వచ్చింది. తెలంగాణలో ప్రముఖుల పేర్లను శాశ్వతం చేయాలనుకున్నాడు. ఎక్కడ వీలయితే అక్కడ తెలంగాణా ఫ్లేవర్ కనబడాలనుకున్నాడు.

సినిమా రంగానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు చాలా ప్రసిద్ధమైనవి. గౌరవప్రదమైనవి. నంది అవార్డు వస్తే ఆస్కార్ వచ్చినట్లుగా ఫీలయ్యేవారు సినిమా వాళ్ళు. కానీ రాష్ట్రం విడిపోయాక నంది అవార్డు అనేది ఆంధ్రవారి అవార్డులనే అభిప్రాయంతో కేసీఆర్ వాటి ప్రధానం ఆపేశాడు. ఏపీలో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.

పదేళ్లు సినిమా రంగానికి అవార్డులు లేకుండాపోయాయి. కేసీఆర్ హంస అవార్డులు ఇస్తామన్నాడు. కానీ కార్యరూపం దాల్చలేదు. రేవంత్ అధికారంలోకి వచ్చాక తెలంగాణా వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించాడు. సినిమా రంగంవారు అసంతృప్తి వ్యక్తం చేసినా చివరకు ఒప్పుకున్నారు. వాస్తవానికి గద్దర్ కు సినిమా రంగంలో పాత్రేమీ లేదు. ఒకటి రెండు సినిమాల్లో పాటలు రాశాడు. పాడాడు. అంతే.

నక్సలైట్ల సానుభూతిపరుడైన గద్దర్ చాలాకాలం అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులకు టార్గెట్ అయ్యాడు. పోలీసు కాల్పుల్లో ఒక బులెట్ ఆయన శరీరంలోనే చనిపోయేవరకు ఉండిపోయింది. సాయుధ పోరాటానికి, ఆ భావజాలానికి క్రమంగా దూరమైన చివరి దశలో ఆధ్యాత్మికం వైపు కూడా మళ్లాడు. దీనికి కమ్యూనిస్టులు బద్ద వ్యతిరేకులు కదా. కానీ గద్దర్ మారిపోయాడు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన పేరును శాశ్వతం చేశాడు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులోని కోఠీ ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చాడు. కానీ పేరు పెట్టలేదు. రేవంత్ రెడ్డి దానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, అప్పటి దొరల మీద తిరగబడిన చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించాడు. ఆమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ అయినా చాకలి ఐలమ్మగానే పాపులర్. ఆమె కూడా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసింది. కానీ ఒక యూనివర్సిటీకి ఆమె పేరు ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఐలమ్మ పోరాట యోధురాలే కానీ ఆమె విద్యావేత్త కాదు. విద్యారంగంలో ఆమె పాత్ర ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకు చదువురాదు అని కొందరు అంటున్నారు. ఆమె సామాజికవర్గం వృత్తి బట్టలు ఉతకడం, వ్యవసాయం చేయడం. రేవంత్ ఆమెను పోరాట యోధురాలిగా గౌరవించాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయలేదు.

రేవంత్ ఆ యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతానని చెప్పాడు. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి సురవరం పేరు తెలుసు. ఆయన ప్రసిద్ధ గోల్కొండ పత్రికకు సంపాదకుడు. గొప్ప రచయిత కూడా. తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం సమంజసమే. ఏది ఏమైనా తెలంగాణలో కమ్యూనిస్టు పోరాట యోధుల పేరు శాశ్వతమయ్యాయి.

One Reply to “కమ్యూనిస్టు యోధులను శాశ్వతం చేసిన రేవంత్ !”

  1. ఈ మనుషుల పేర్లు పెట్టటం ఎంత తొందరగా మానేస్తే మనకి అంట మంచిది. అలాగా పావురాళ్ళు కోసం నాయకుల విగ్రహాలు. మన ఖర్మ ఇదంతా.

Comments are closed.