విశాఖ సిటీలో నాలుగు సీట్లు గెలుచుకున్న టీడీపీకి ఆ ఆనందం ఎపుడూ లేదు. అందులో ఒకరైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ఫలితాల తరువాత దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇపుడు సడెన్ గా ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమం
పేరిట తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు, ఏకంగా జగన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పంతా జగన్ దేనని ఆయనని కార్నర్ చేయాలని టీడీపీ పెద్దల ఆలోచన. కానీ గంటా మాత్రం సొంత అజెండా బయటకు తీసి మరీ రాజీనామా అస్త్రం సంధించారు. అంతే కాదు, స్టీల్ ప్లాంట్ రక్షణ పేరిట జగన్ ప్రధానికి లేఖ రాయడం మంచి పరిణామం అంటున్నారు.
ఇదిలా ఉంటే గంటా రాజీనామా చేయడంతో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల మీద కూడా వత్తిడి పెరుగుతోంది. వారు కూడా తాము రాజీనామాలకు రెడీ అంటున్నారుట. మరి ఇలా ఒక్కసారిగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే దాన్ని స్పీకర్ కూడా ఆమోదిస్తారని, అపుడు తన ప్రతిపక్ష సీటుకే ఎసరు వస్తుందని బాబు లో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు.
ఏ ఒక్కరూ పార్టీ లైన్ దాటవద్దు, రాజీనామాలు అసలే వద్దు అని టీడీపీ పెద్దలు గట్టిగానే చెబుతున్నారు. మరి గంటా రాజీనామాతో ఒక్కసారిగా టీడీపీని కెలికారు. మరి అది ఇక్కడితో ఆగుతుందా లేదా అన్నదే ఆ పార్టీలో చర్చగా ఉందిట.