కుయ్యోమొర్రో.. నేను పార్టీ మార‌డం లేదు!

తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. వ‌చ్చే నెల 3వ తేదీ నుంచి నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. వ‌చ్చే నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండుమూడు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే బీఆర్ఎస్ అభ్య‌ర్థులంద‌రినీ ఎంతో…

తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. వ‌చ్చే నెల 3వ తేదీ నుంచి నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. వ‌చ్చే నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండుమూడు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే బీఆర్ఎస్ అభ్య‌ర్థులంద‌రినీ ఎంతో ముందే ప్ర‌క‌టించింది. దీంతో బీఆర్ఎస్ ప్ర‌చారం జోరు అందుకుంది. 

కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం 60కి లోపు అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించాయి. ఇంకా అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఎడ‌తెగ‌ని క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో అటూఇటూ నాయ‌కుల జంపింగ్‌లు జ‌రుగుతున్నాయి. టికెట్ ఆశించి, భంగ‌ప‌డిన నాయ‌కులు పార్టీలు మారుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే ప్ర‌చారంతో ఆ పార్టీలో చేర‌డానికి ఎక్కువ మంది నాయ‌కులు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంక‌ట‌స్వామిలు కాంగ్రెస్‌లో చేరుతార‌ని కొంత కాలంగా విస్తృత‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎట్ట‌కేల‌కు బీజేపీని వీడారు. శుక్ర‌వారం ఆయ‌న కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. ఇక మిగిలింది వివేక్ వెంక‌ట‌స్వామి. ఈయ‌న తండ్రి వెంక‌ట‌స్వామి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో ప‌ని చేశారు. వెంక‌ట‌స్వామి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న‌యులు స్వీక‌రించారు.

చిన్న కుమారుడైన వివేక్ వెంక‌ట‌స్వామి పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో బుధ‌వారం ఆయ‌న స్పందించారు. రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారుతున్నార‌ని, ఇక మీ వంతు ఎప్పుడ‌ని మీడియా ప్ర‌తినిధులు ఆయ‌న్ను ప్ర‌శ్నించారు. రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మార్పు గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, తాను మాత్రం బీజేపీలోనే వుంటాన‌ని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ త‌ర‌పున బ‌రిలో దిగుతాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇక‌నైనా వివేక్ పార్టీ మార్పుపై ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ ప‌డుతుందేమో చూడాలి.