మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు

ఇవాళ జ‌రిగిన కేబినెట్ స‌మావేశానికి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి గైర్హాజ‌రు కావ‌డంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. త‌న‌కు ప్ర‌మోష‌న్ కాకుండా, డిమోష‌న్ ఇచ్చినందుకు మ‌న‌స్తాపం చెందిన కిష‌న్‌రెడ్డి త‌న మంత్రి ప‌దవికి రాజీనామా…

ఇవాళ జ‌రిగిన కేబినెట్ స‌మావేశానికి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి గైర్హాజ‌రు కావ‌డంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చాయి. త‌న‌కు ప్ర‌మోష‌న్ కాకుండా, డిమోష‌న్ ఇచ్చినందుకు మ‌న‌స్తాపం చెందిన కిష‌న్‌రెడ్డి త‌న మంత్రి ప‌దవికి రాజీనామా చేసిన‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కిష‌న్‌రెడ్డి స్పందించారు.

కేంద్ర మంత్రి ప‌దవికి తాను రాజీనామా చేయ‌లేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే కేబినెట్ స‌మావేశానికి వెళ్ల‌లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఆశించిక కిష‌న్‌రెడ్డి, మ‌ళ్లీ తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వితోనే స‌రిపెట్టు కోవాల్సి రావ‌డంతో నొచ్చుకున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. ఈ ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టి పారేశారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. తెలంగాణ బీజేపీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తార‌ని అనుకోలేద‌న్నారు.

గతంలో ఉమ్మడి ఏపీకి 2 సార్లు, తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఒకసారి పని చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. నాల్గోసారి బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని త‌న‌పై అధిష్టానం పెట్టింద‌ని, అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌ని చేస్తాన‌ని ఆయ‌న అన్నారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ అడ‌గ‌లేద‌ని, కోర‌లేద‌న్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల‌ను పాటించ‌డ‌మే త‌న‌కు తెలుస‌న్నారు. 1980 నుంచి పార్టీ కోసం ఒక సైనికుడిలా ప‌ని చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌ధాని మోదీ రెండు రోజుల్లో వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని, ఏర్పాట్ల‌పై దృష్టి సారించామ‌న్నారు.  

రైల్ వ్యాగన్ తయారీ కేంద్రానికి ప్రధాని భూమిపూజ చేస్తారన్నారు. 150 ఎకరాల్లో ఈ పరిశ్రమను నెల‌కొల్ప‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. వరంగల్‌ను రైల్వే తయారీ హబ్‌గా తయారు చేయబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్, తయారీ యూనిట్ రావడం ఇదే మొదటిసారని కిష‌న్‌రెడ్డి తెలిపారు.