కాంగ్రెస్‌లో కోమ‌టిరెడ్డి చేరిక‌కు ముహూర్తం ఖ‌రారు!

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక‌పై సందిగ్ధం వీడింది. కాంగ్రెస్‌లో చేరిక‌కు ముహూర్తం కూడా ఖ‌రారైంది. ఇవాళ ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి…

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక‌పై సందిగ్ధం వీడింది. కాంగ్రెస్‌లో చేరిక‌కు ముహూర్తం కూడా ఖ‌రారైంది. ఇవాళ ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన‌ట్టు తాజా స‌మాచారం. దీంతో ఆయ‌న పార్టీ మార్పుపై స‌స్పెన్ష్ వీడింది.

కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున‌ఖ‌ర్గే, అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో ఢిల్లీలో శుక్ర‌వారం ఉద‌యం 11.12 గంట‌ల‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పుకోడానికి ముహూర్తం ఖ‌రారు చేయ‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి గెలుపొందారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో ఆయ‌న‌కు పొస‌గ‌లేదు. దీంతో కాంగ్రెస్ కార్య‌క‌లాపాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు.

అనంత‌రం అమిత్‌షాతో భేటీ, బీజేపీలో చేరిక చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఉప ఎన్నిక‌లో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ప్ర‌ధానంగా కేసీఆర్‌కు వ్య‌తిరేక రాజ‌కీయాలు బీజేపీలో సాధ్య‌మ‌ని కోమ‌టిరెడ్డి న‌మ్మారు. కొంత కాలంగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ప్ర‌చారం తెలంగాణ‌లో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

దీంతో కోమ‌టిరెడ్డి బీజేపీలో అసౌక‌ర్యంగా వుంటున్నారు. మ‌రోవైపు తెలంగాణ‌లో కాంగ్రెస్ పుంజుకోవ‌డంతో కోమ‌టిరెడ్డి మ‌న‌సు మారుతూ వ‌చ్చింది. చివ‌రికి కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారుతార‌నే ప్ర‌చారాన్ని ఆయ‌న నిజం చేశారు. ఇవాళ్టితో బీజేపీతో బంధాన్ని తెచ్చుకున్నారు. తిరిగి త‌న మాతృపార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరేందుకు అన్నీ మాట్లాడుకున్నారు. మునుగోడు నుంచి తిరిగి ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు. బీజేపీలో కోమ‌టిరెడ్డి ప్ర‌స్థానం మూణ్ణాళ్ల ముచ్చ‌టైంది.