మరో విలీనం.. బిక్కుబిక్కుమంటున్న ఉద్యోగులు

మాటీవీ చేతులు మారడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఇలా చేతులు మారుతున్న ప్రతిసారి ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఎగ్జిట్ ప్యాకేజీ ఘనంగా ఉన్నప్పటికీ చేతిలో జాబ్ లేక బాధపడిన ఉద్యోగులు చాలామంది. Advertisement ప్రస్తుతం డిస్నీ+హాట్…

మాటీవీ చేతులు మారడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఇలా చేతులు మారుతున్న ప్రతిసారి ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఎగ్జిట్ ప్యాకేజీ ఘనంగా ఉన్నప్పటికీ చేతిలో జాబ్ లేక బాధపడిన ఉద్యోగులు చాలామంది.

ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ గా కొనసాగుతున్న ఈ కంపెనీ.. ఇప్పుడు జియో సినిమాలో విలీనం కాబోతోంది. భారతీయ మీడియా రంగంలోనే అతిపెద్ద విలీనంగా దీన్ని చెబుతున్నారు. విలువ దాదాపు 70వేల కోట్ల రూపాయలు. అయితే ఈసారి కూడా ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.

రిలయన్స్ వయకామ్-18 చేతిలో 40 టీవీ ఛానెళ్లున్నాయి. డిస్నీ హాట్ స్టార్ వద్ద 80 టీవీ ఛానెళ్లున్నాయి. విలీనంతో ఇప్పుడు ఏకరూప ఛానెళ్లలో ఉద్యోగాలు పోతున్నాయి. ఉదాహరణకు తెలుగులో మూవీ ఛానెల్, మ్యూజిక్ ఛానెల్ నిర్వహణను కుదించారు. గతంలోనే ఆ ఛానెళ్లలో ఉద్యోగుల్ని తగ్గించిన కంపెనీ, ఇప్పుడు వాటిని తీసుకెళ్లి రిలయన్స్ ఆధీనంలో ఉన్న ఛానెళ్లకు ఎటాచ్ చేయబోతోంది. దీంతో కంపెనీలో మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే విధంగా జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ ఓటీటీల్లో కూడా జరగబోతోంది.

టాలీవుడ్ పై ప్రభావం..

ఉద్యోగుల పైన మాత్రమే కాదు, టాలీవుడ్ పై కూడా ఈ ప్రభావం పడబోతోంది. ఓటీటీ రైట్స్ కోసం డిస్నీ హాట్ స్టార్, జియో సినిమా అంటూ ఇకపై 2 ఆప్షన్లు ఉండవు. దీంతో టాలీవుడ్ మేకర్స్ కు ఆ మేరకు అవకాశాలు తగ్గినట్టే. కేవలం మూవీ ఎక్విజిషన్ లో మాత్రమే కాదు, కంటెంట్ క్రియేషన్ లో కూడా మేకర్స్ కు అవకాశాలు తగ్గినట్టే. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ ఫిలిమ్స్ పై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది.

వినియోగదారుడి పరిస్థితేంటి?

ఈ మొత్తం వ్యవహారంలో వినియోగదారుడి పరిస్థితేంటి? ఐపీఎల్ మ్యాచుల్ని టీవీలో చూడాలంటే హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. అదే ఐపీఎల్ ను ఓటీటీలో చూడాలంటే జియో సబ్ స్క్రిప్షన్ కావాల్సిందే. ఈ రెండు కలవడంతో ఇకపై మ్యాచులు చూడడం సులభం, పైగా చవక కూడా.

ఇదే విధంగా ఈ రెండు సంస్థలు కలిపి చూస్తే 2 లక్షల గంటల కంటే ఎక్కువగా ఒరిజినల్ కంటెంట్ ఉంది. జీఈసీ (జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్)తో పాటు స్పోర్ట్స్, కిడ్స్ ఛానెళ్లన్నీ ఇప్పుడు ఒకే ప్యాకేజీ కింద, తక్కువ రేటుకు డీటీహెచ్ లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే ఇక్కడ కొన్ని భయాలు కూడా ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జియో మొబైల్ సర్వీసులు. ప్రారంభంలో అత్యంత చవకగా రీచార్జ్ ప్లాన్స్ ఇచ్చారు, డేటా అయితే ఇబ్బడిముబ్బడిగా అందించారు. అందరూ అలవాటు పడిన తర్వాత ధరలు పెంచారు. ఇప్పుడు జియో, ఎయిర్ టెల్ లో ఏది తీసుకున్నా దాదాపు రేట్లు అన్నీ ఒకటే. సో.. రాబోయే రోజుల్లో జియో సినిమా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తో పాటు డీటీహెచ్ ప్లాన్స్ కూడా ఇలానే పెరిగే ప్రమాదం ఉందనేది చాలామంది భయం. ఆ భయంలో నిజం ఉంది కూడా.

విలీనం తర్వాత రిలయెన్స్ 63.16 శాతం వాటా, డిస్నీకి 36.84 శాతం వాటా కలిగి ఉంటాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ను ఎదుర్కొనేందుకు ఇది వ్యూహాత్మక భాగస్వామ్యమే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో రిలయన్స్ మాట మాత్రమే చెల్లుబాటు అవుతుందనేది కాదనలేని వాస్తవం.

8 Replies to “మరో విలీనం.. బిక్కుబిక్కుమంటున్న ఉద్యోగులు”

  1. ఒక విదేశీ యాజమాన్యం నించి స్వదేశీ కి మారితే ఇంక నాసామీరంగా.. నరకం చూబిస్తారు…

  2. ఇప్పటికీ జియో మొబైల్ చార్జ్ లు తక్కువే, జియో రాక ముందు 5 GB డేటా తీసుకుంటే ₹700 ఛార్జి ఉండేది. రోజు కి రెండు గంటలు ఫోన్ కాల్స్ మాట్లాడితే వెయ్యి రూపాయలు అయ్యేది!

  3. రాబోయే రోజుల్లో రిలయన్స్ మాట కి అంత సీన్ లేదు , ఒక్కసారి మోడీ పోతే అదానీ , అంబానీ అడుక్కుతినడమే లేకుంటే కాంగ్రెస్ కి ఆ గతి పట్టిస్తారు

Comments are closed.