నిమ్మ‌గ‌డ్డ మ‌రో సంచ‌ల‌నం

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ‌రుస సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎస్ఈసీ, జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎస్ఈసీ మ‌రో సంచ‌ల‌న…

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ‌రుస సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎస్ఈసీ, జ‌గ‌న్ స‌ర్కార్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎస్ఈసీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది జ‌గ‌న్ స‌ర్కార్‌తో మ‌రింత దూరం పెంచేలా ఉంది.

పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు ఇంటికే ప‌రిమితం చేయాలంటూ డీజీపీ గౌత‌మ్‌స‌వాంగ్‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఆదేశించి సంచ‌ల‌నానికి తెర తీశారు. ఇటీవ‌ల నిమ్మ‌గ‌డ్డ‌పై పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అస‌లు ఓటు హ‌క్కు న‌మోదు చేసుకోవ‌డం తెలియ‌ని వ్య‌క్తి ఎస్ఈసీగా ఉండ‌డం ఏంట‌ని ఆయ‌న ఘాటుగా ప్ర‌శ్నించారు.

తాజాగా పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరుతో పాటు గుంటూరు జిల్లాల్లోని ఏక‌గ్రీవ పంచాయ‌తీల విష‌య‌మై వివాదం నెల‌కుంది. ఈ జిల్లాల్లో ఎక్కువ పంచాయ‌తీలు ఏక‌గ్రీవ‌మ‌య్యాయ‌నే కార‌ణంతో వాటిని ప్ర‌క‌టించ‌కుండా, విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని సంబంధిత జిల్లా అధికారుల‌ను ఎస్ఈసీ ఆదేశించారు. నిమ్మ‌గ‌డ్డ ఆదేశాల‌పై మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు.

‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

ఈ నేప‌థ్యంలో మంత్రి పెద్దిరెడ్డిని క‌ట్ట‌డి చేసేందుకు ఎస్ఈసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసే వ‌ర‌కూ ఆయ‌న్ను ఇంటికే ప‌రిమితం చేయాల‌ని డీజీపీని నిమ్మ‌గ‌డ్డ ఆదేశించారు. అలాగే మంత్రి మీడియాతో మాట్లాడ‌కుండా క‌ట్ట‌డి చేయాల‌ని ఆదేశాలిచ్చారు.

ఎన్నిక‌లు నిజాయితీగా, నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిగేందుకు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు ఎస్ఈసీ వెల్ల‌డించారు. అలాగే ప్ర‌జ‌లు నిర్భ‌యంగా ఓటు వేసేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ఆయ‌న తేల్చి చెప్పారు. ఎస్ఈసీ నిర్ణ‌యంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.  

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్