జీఆర్ మ‌హ‌ర్షిః కెజిఎఫ్‌.2లో వుండాల్సింది ఏదో లేదు

కెజిఎఫ్‌.2లో వుండాల్సింది ఏదో లేదు. అన్నీ వున్నా అదేదో త‌క్కువ అంటారే అలా వుంది. సింపుల్‌గా చెప్పాలంటే మ‌సాలా ఎక్కువై చికెన్ కోసం వెతుక్కోవ‌డం. బిల్డ‌ప్ ఎక్కువై క‌థ‌ని మిస్ కావ‌డం. అదేంటి మైండ్‌బ్లోయింగ్‌,…

కెజిఎఫ్‌.2లో వుండాల్సింది ఏదో లేదు. అన్నీ వున్నా అదేదో త‌క్కువ అంటారే అలా వుంది. సింపుల్‌గా చెప్పాలంటే మ‌సాలా ఎక్కువై చికెన్ కోసం వెతుక్కోవ‌డం. బిల్డ‌ప్ ఎక్కువై క‌థ‌ని మిస్ కావ‌డం. అదేంటి మైండ్‌బ్లోయింగ్‌, గూస్‌బంప్స్ ఒక రేంజ్ హీరో ఎలివేష‌న్ వుంటే ఇంకా ఏం కావాలి? అవును ఏ సీన్‌కాసీన్ విడివిడిగా చాలా సీన్స్ బాగున్నాయి. విడివిడిగా వున్న పూల‌కి, పూల‌దండ‌కి చాలా తేడా వుంది. సినిమా క‌థ‌కి రూల్స్ అక్క‌ర్లేదు అని కొంత మంది అంటూ వుంటారు. ప్ర‌పంచం పుట్టిన‌ప్ప‌టి నుంచి క‌థ‌కి కొన్ని రూల్స్ వున్నాయి. అలాంటి క‌థ‌లే రూల్ చేస్తాయి.

అస‌లు సినిమా కానీ, సీరియ‌ల్ కానీ, నాట‌కం కానీ ఎందుకు చూస్తాం? క‌థ‌లు ఎందుకు చ‌దువుతాం? ఎందుకంటే ఇత‌రుల జీవితాల్లోకి తొంగి చూడాల‌నే కోరిక‌, మ‌న జీవితంలో లేనివి స్క్రీన్ మీద జ‌రుగుతూ వుంటే చూసే థ్రిల్‌. ఇత‌రుల క‌థ‌లు లేకుండా జీవించ‌లేం. అదే విధంగా మ‌న జీవితం ఇత‌రులకి క‌థ‌.

సినిమాలో ఒక క‌థ చూస్తున్న‌ప్పుడు మ‌న‌కి తెలియ‌కుండానే న్యాయం వైపు వుంటాం. బ‌ల‌హీనుల ప‌క్షాన నిల‌బ‌డ‌తాం. మ‌నం దుర్మార్గులైనా స‌రే (చాలా మందికి తాము దుర్మార్గుల‌నే సంగ‌తి తెలియ‌దు). విల‌న్‌ని స‌పోర్ట్ చేయం. అయితే ఎమోష‌న్ క‌నెక్ట్ కావాలంటే కొన్ని జ‌ర‌గాలి.

ఉదాహ‌ర‌ణ‌కి రామాయ‌ణం తీసుకుంటే రాముడు అయోధ్య‌కి వెళ్లి సైన్యంతో లంక మీద‌కి దండెత్తితే థ్రిల్ లేదు. అడ‌వుల్లో క‌ష్టాలు ప‌డి , కోతి మూక‌తో సేతువు నిర్మించి యుద్ధం చేశాడు కాబ‌ట్టే హీరో. రాముడి క‌ష్టం, సంఘ‌ర్ష‌ణ‌లే హీరోయిజం. భార‌తంలో కూడా ఇంతే. పాండ‌వులు సైన్యాల‌తో కురుక్షేత్రంలో నేరుగా యుద్ధం చేస్తే ఆ క‌థ‌లో ట్విస్ట్ లేదు. వాళ్లు అజ్ఞాత‌వాసంలో క‌ష్టాలు ప‌డి, ఐదు వూళ్లు ఇవ్వ‌మ‌ని దేబిరించినా దుర్యోధ‌నుడు తిర‌స్క‌రించ‌డం వ‌ల్లే ఆ యుద్ధం మ‌న‌దైంది. పాండ‌వుల గెలుపు మ‌న‌దిగా మారింది. 

బాహుబ‌లి, చ‌త్ర‌ప‌తిలో హీరోయిజ‌మంతా వాళ్లు అనుభ‌వించిన సంఘ‌ర్ష‌ణ‌లోనే వుంది. కెజిఎఫ్‌.1కి క‌నెక్ట్ కావ‌డానికి ఇదే కార‌ణం. ఎలాంటి అంచ‌నాలు లేకుండా చూసిన సినిమా ప్రేక్ష‌కుల్ని పీక్స్‌కి తీసుకెళ్లింది.

పార్ట్‌-2 అంచ‌నాలు వేరు. ద‌ర్శ‌కుడి మీద అతిపెద్ద భారం. పార్ట్‌1ని మించి వుండాలి. క‌థ‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్టు రాసుకుని శ‌క్తినంతా బిల్డ‌ప్ మీద పెట్టాడు. పోనీ విల‌న్‌గా సంజ‌య్‌ద‌త్ వున్న‌ప్పుడు అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ మీద శ్ర‌ద్ధ పెట్టాడా అంటే అదీ లేదు. అత‌నో మృగంలా అరుస్తూ వుంటాడు. మ్యూజిక్ ఫొటోగ్ర‌ఫీల‌తో సినిమా ఎంత రిచ్‌గా వున్నా విల‌న్ల‌ని కొడుతున్న‌ప్పుడో, న‌రుకుతున్నప్పుడో ప్రేక్ష‌కుల్లో చ‌ల‌నం లేక‌పోవ‌డానికి ఇదే కార‌ణం.

హీరో అనుకుంటే ఏమైనా చేస్తాడు, ఒక మాన‌వాతీత శ‌క్తి అని డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ న‌మ్మాడు, అదే తీశాడు. అందుకే పార్ల‌మెంట్‌కి వెళ్లి ప్ర‌ధాని ఎదురుగానే హీరో ఒక‌ర్ని కాలుస్తాడు. క‌థా కాలం చూస్తే వాస్త‌వ ప్ర‌ధాని ఇందిరాగాంధీ, ఒక క్రిమిన‌ల్ ఆమె ద‌రిదాపుల‌కి కూడా, అదీ పార్ల‌మెంట్‌లో వెళ్ల‌లేడ‌ని ప్ర‌శాంత్‌కి తెలియ‌దేమో! తెలిసినా సినిమా లిబ‌ర్టి కింద ప్రేక్ష‌కులే స‌ర్దుకుపోతార‌ని ఆయ‌న ఉద్దేశ‌మేమో! పార్ట్ 3లో అమెరికా అధ్య‌క్షుడుతో హీరో మందు తాగే సీన్ వున్నా వుంటుంది. ఎందుకంటే చూడ్డానికి మ‌నం వున్నాం క‌దా!

సినిమా చాలా శ‌క్తివంత‌మైన క‌ళ‌. కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తుంది. అద్భుత‌మైన టేకింగ్ తెలిస్తే చాల‌దు. ఫిల్మ్ మేకింగ్‌కి ఇంకా ఏదో కావాలి. బ‌హుశా అదే దీంట్లో మిస్ అయ్యింది.