కోమటిరెడ్డి, వివేక్ ఫిరాయిస్తే, బాధ్యత ఎవరిది?

భారతీయ జనతా పార్టీలోకి అడుగుపెట్టే ప్రతి నాయకుడు కూడా.. ఆ పార్టీ సిద్ధాంతాల మీది ప్రేమతో, నాయకుల మీద నమ్మకంతో వస్తుంటారని అనుకోవడం ఒక భ్రమ. వారి వారి వ్యక్తిగత రాజకీయ అవసరాల మేరకు…

భారతీయ జనతా పార్టీలోకి అడుగుపెట్టే ప్రతి నాయకుడు కూడా.. ఆ పార్టీ సిద్ధాంతాల మీది ప్రేమతో, నాయకుల మీద నమ్మకంతో వస్తుంటారని అనుకోవడం ఒక భ్రమ. వారి వారి వ్యక్తిగత రాజకీయ అవసరాల మేరకు గతిలేక అంతో ఇంతో ఆశావహంగా తమ ఆశలు చెల్లుబాటు అవుతాయని అనిపించే పార్టీల్లోకి మారిపోతూ ఉంటారు.

ఇలాంటి తత్వమున్న కొందరు నాయకుల ఫిరాయింపులు వారి జీవితపర్యంతమూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందుకు, వారు ఏ పార్టీనైతే వీడుతున్నారో.. ఆయా పార్టీల్లోని కొందరు నాయకుల వైఖరి కూడా చాలా సందర్భాల్లో కారణం అవుతూ ఉంటుంది.

కాంగ్రెసు మూలాలను కలిగి ఉండి ప్రస్తుతం భాజపాలో ఉన్న మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు ఇప్పుడు ఆ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా ముమ్మరంగా ఉంది.

ఈ ఎన్నికల్లోనే తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్న భాజపా.. ఈ ఇద్దరు నాయకులకు కూడా కొన్ని కమిటీల్లో చోటు కల్పించి.. వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపించడానికి ప్రయత్నించింది.

అలాగే, వారి మాటకు విలువ ఇచ్చి రాష్ట్ర సారథ్యంలో కొన్ని మార్పు చేర్పులను కూడా చేసింది. ఇంత చేసినా కూడా.. ఇప్పుడు వారు కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. నేడో రేపో ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోనుండడం గమనించాలి. 

కేసీఆర్ సర్కారు మీద సభలలో ఎంతగా నిప్పులు కురిపించినప్పటికీ.. ఆ పార్టీతో భాజపా కుమ్మక్కు అయి ఉందనే వాదనను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు.

ఈ ఇద్దరు నాయకులు కోమటిరెడ్డది రాజగోపాల్, వివేక్.. తీవ్రమైన కేసీఆర్ వ్యతిరేకతతో చెలరేగుతున్న వారు. కేసీఆర్ తిరిగి గెలవకుండా అడ్డుకోవాలనే కోరికతో జ్వలించిపోతున్న వారు. ఇలాంటి వారు భాజపాను వీడిపోయే ఆలోచనతో ఉండడం.. ఆ పార్టీ క్రెడిబిలిటీకి దెబ్బ!

ఇప్పుడు వారి వెళ్లిపోవడం అనేది.. కేసీఆర్ వ్యతిరేక ఓటర్లలో భాజపా పట్ల అపనమ్మకాన్ని పెంచుతుంది కూడా. 

ఇంతకూ ఈ కీలక నాయకులు వెళ్లిపోవడానికి కారకులు ఎవరు? కేవలం అధిష్ఠానం పోకడలు మాత్రమేనా? లేదా రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి పాత్రకూడా ఉందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

కిషన్ రెడ్డి పగ్గాలు స్వీకరించిన తర్వాత.. రాష్ట్ర బిజెపిని శవాసనం వేయించారనే ప్రచారం ఉంది. ఆయన కేసీఆర్ సర్కారు మీద సుతిమెత్తటి విమర్శలతో స్పందిస్తూ పార్టీ మీద ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నారు. ఈ వైఖరి సహించలేకనే ఈ ఇద్దరు నాయకులు.. కాంగ్రెసులోకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది.