జిల్లాల పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఒక్కో జిల్లాలో ఒక్కో ముచ్చట చెబుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా ఆయన తన లవ్ స్టోరీని రివీల్ చేశారు.
ఇన్నాళ్లూ చంద్రబాబుకి, నిమ్మగడ్డకి మధ్య ప్రేమ వ్యవహారాన్ని కొంతమంది వట్టి పుకారుగానే కొట్టిపారేస్తున్నారు. వైసీపీ ఎంత మొత్తుకుంటున్నా.. ఓ వర్గం మాత్రం కేవలం సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని కట్టుకథలు అల్లుతారా అంటూ మండిపడుతున్నారు. అయితే ఎట్టకేలకు స్వయంగా నిమ్మగడ్డే తన ప్రేమాయణాన్ని బైటపెట్టుకున్నారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదలచేసిన టీడీపీ మేనిఫెస్టోని ప్రచారంలో వినియోగించొద్దు అంటూ పెదరాయుడు లెవల్లో సంచలన తీర్పునిచ్చారు. అదే మేనిఫెస్టో వైసీపీ విడుదల చేసి ఉంటే ఈ పాటికి ఆ పార్టీ ఎన్నికల గుర్తింపు రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసేవారేమో.
ఆ స్థాయిలో ఉండేది నిమ్మగడ్డ రెస్పాన్స్. కానీ ఆ పనిచేసింది తన ఆత్మబంధువు చంద్రబాబు కాబట్టి సున్నితంగా, సుతారంగా ఓ మాట చెప్పేసి వదిలిపెట్టారు. టీడీపీ మేనిఫెస్టోని ప్రచారంలో వాడొద్దు అని మాత్రమే చెప్పి ఊరుకున్నారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచ సూత్రాలంటూ చంద్రబాబు ఇటీవల మేనిఫెస్టో విడుదల చేశారు. అప్పటికే గ్రామాల్లో అమలవుతున్న నీరు, విద్యుత్, ఇళ్ల పట్టాలు.. ఇలా పాత పథకాలకే కొత్త అట్ట వేసి తీసుకొచ్చారు. ఆ అట్టమీద తన ఫొటో, తన కొడుకు ఫోటో (అవి కూడా పాతవే) ముద్ర వేయించుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. దమ్ముంటే టీడీపీపై చర్య తీసుకోవాలంటూ సవాల్ విసిరారు.
అయితే ఈసీ ఇంత పనిచేస్తారని ఎవరూ అనుకోలేదు. రేపిస్ట్ లకు బెత్తం దెబ్బలు చాలంటూ సెలవిచ్చిన పవన్ కల్యాణ్ కంటే ఉదారంగా.. ఆ మేనిఫెస్టో ని ప్రచారంలో వాడొద్దంటూ టీడీపీకి సూచించారు ఎస్ఈసీ. అంతకంటే ముందు టీడీపీ వివరణ కోరిన ఈసీ, అది సంతృప్తికరంగా లేదని ఈ నిర్ణయం తీసుకుందట. ఇంతకంటే వింత, విడ్డూరం మరోటి ఉంటుందా?
చంద్రబాబుని పల్లెత్తు మాట అనకుండా మేనిఫెస్టో పత్రాలను ప్రచారంలో వినియోగించొద్దు అని సూచించారంటే.. అంతకంటే దారుణం ఇంకోటి ఉందా? అదే పని వైసీపీ చేసి ఉంటే ఈపాటికే నానా రచ్చ చేసే నిమ్మగడ్డ.. చంద్రబాబు చేశారు కాబట్టి తన ప్రేమను అలా వ్యక్తపరిచారు.
అభిమానంతో కూడిన గౌరవం వల్ల కలిగిన ప్రేమతో మేనిఫెస్టో బయట కనిపించకుండా చూడండి అంటూ సుతిమెత్తని బెత్తం దెబ్బ కొట్టారు, అది కూడా తన చేయిని అడ్డం పెట్టి.