వేసవి మొదలైందంటే తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. వేసవిలో కాకుండా చలికాలంలో భక్తులు క్యూ కడతారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. ఒకవైపు వేసవి మొదలై, తిరుమలకు భక్తుల రాక పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.
అయినా భక్తులకు తగిన వసతి, స్వామి దర్శన భాగ్యం కల్పించాలన్న ఆలోచన, చిత్తశుద్ధి టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలిలో కరువైంది. చలికాలంలో ఉన్నట్టే, వేసవిలోనూ టీటీడీ బాధ్యులు రిలాక్ష్ కావడం ఆశ్చర్యం కలిగి స్తోంది. తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు.
ఈ నేపథ్యంలో మరోసారి టీటీడీ రాజకీయ విమర్శలకు తావిచ్చింది. టీటీడీ చర్యలన్నీ అతివృష్టి, అనావృష్టిని తలపిస్తున్నాయి. ఒకసారి సర్వదర్శనం టికెట్లను ఉన్నట్టుండి నిలిపివేస్తారు. తాజాగా ఆదివారం వరకూ బ్రేక్ దర్శనాలను అకస్మాత్తుగా రద్దు చేశారు. ఇటు సామాన్యులు, అటు వీఐపీల నుంచి టీటీడీకి శాపనార్థాలు తప్పలేదు.
ముందే బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేసుకుని, తిరుమలకు వచ్చిన వీఐపీ భక్తులకు టీటీడీ ఉన్నట్టుండి షాక్ ఇచ్చింది. కనీస ముందస్తు సమాచారం లేకుండా బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాస లకు ఓర్చి, తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోకుండా వెనుతిరగాల్సిన దుస్థితి కలగడానికి తప్పు తమదా? టీటీడీ అధికారులదా? అని ప్రశ్నిస్తున్నారు.
మంగళవారం సర్వదర్శనం టోకన్ల జారీలో టీటీడీ వైఫల్యాన్ని మరింతగా కళ్లకు కట్టింది. క్యూలైన్లలో తొక్కిసలాట, కొంత మంది భక్తులకు గాయాలు తదితర ఘటనలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. దర్శనాలు, వసతి సౌకర్యాల కల్పనపై టీటీడీ పాలక మండలి, అలాగే ఉన్నతాధికారులకు పర్యవేక్షణ కొరవడడం వల్లే ఈ దుస్థితి.
భక్తులు, ప్రజలతో సంబంధాలు కొరవడడం వల్లే టీటీడీలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలకు తెరలేచింది. ఇదే అవకాశంగా తీసుకుని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు విమర్శలకు దిగారు.
శ్రీవారి భక్తులను కూడా రాజకీయ నేతలు పరామర్శించే పరిస్థితి రావడానికి కారణాలేంటో టీటీడీ పాలకులు, ఉన్నతాధికారులు ఆలోచన చేయాల్సి ఉంది. ఇకనైనా శ్రీవారి భక్తులకు ఇబ్బందులను తగ్గిస్తే, అదే పదివేలు!