శాఖాహారంతో బొత్స హ్యాపీయేనా… ?

ఉత్తరాంధ్రా జిల్లాలలో బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనది మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ అనుభవం. ఆయన రాజకీయ వ్యూహాలకు తోడు సామాజిక బలం కూడా కలసి వచ్చి ఎపుడూ ఆయన అప్పర్…

ఉత్తరాంధ్రా జిల్లాలలో బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనది మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ అనుభవం. ఆయన రాజకీయ వ్యూహాలకు తోడు సామాజిక బలం కూడా కలసి వచ్చి ఎపుడూ ఆయన అప్పర్ హ్యాండ్ గానే పాలిటిక్స్ లో ఉంటున్నారు.

ఇదిలా ఉంటే మలివిడత మంత్రివర్గ విస్తరణలో బొత్సకు పదవి దక్కదని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ దాన్ని పూర్వపక్షం చేస్తూ బొత్స మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. మొత్తానికి తాను అయిదేళ్ల మంత్రిగా జగన్ క్యాబినెట్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు.

అన్నీ బాగానే ఉన్న బొత్సకు దక్కిన విద్యా శాఖ పట్ల మాత్రం ఆయన ఫ్యాన్స్ కాస్తా అన్ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చూడబోతే ఇది పూర్తిగా శాఖాహారమైన శాఖగా అభివర్ణిస్తారు. ప్యూర్ వెజిటేరియన్ డిపార్ట్మెంట్ అన్న మాట. అలాగే పక్కా మాస్ లీడర్ బొత్సకు క్లాస్ శాఖ ఇచ్చారని అంటున్నారు. బొత్సకు ఇంతకు ముందు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖలను ఇచ్చారు. దాంతో ఆయన ఒక రేంజిలో హవా చలాయించారు. పైగా ప్రజలతో సంబంధం ఉన్న శాఖలు అవి.

ఇక మూడు రాజధానుల ఇష్యూతో బొత్స ఎపుడూ లైమ్ లైట్ లో ఉండేవారు. అలాంటి బొత్సకు విద్యా శాఖ ఇవ్వడం అంటే ఆయన్ని పెంచారా లేక తగ్గించారా అన్న చర్చ అయితే వస్తోందిట. ఎందుకంటే విద్యా శాఖకు ప్రజలతో పెద్దగా పని ఉండదు. అయితే జగన్ వచ్చాక విద్యా శాఖ ప్రాధాన్యత బాగా పెరిగింది. పెద్ద ఎత్తున నిధులు నాడు నేడు పేరిట ఖర్చు చేస్తున్నారు.

ఇక చూస్తే ప్రాధమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా అన్నీ కలిపిన శాఖ ఇది. దాంతో బొత్స హోదాకు తగిన శాఖే ఇది అని కూడా అంటున్నారు. గతంలో ఉత్తరాంధ్రాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇదే శాఖను నిర్వహించారు. 

సో బొత్స బేఫికర్ గా ఈ శాఖలో కూడా దూసుకుపోవచ్చు అనే వారూ ఉన్నారు. మొత్తానికి మా బొత్స మంత్రి అయ్యారు అది చాలు అన్నదే ఇప్పటికి అభిమానుల సంబరం.