పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్.. ఏపీ కేబినెట్ లో ప్రెస్ మీట్లు పెట్టినా, ప్రతిపక్షాలకు చీవాట్లు పెట్టినా వీరికే చెల్లింది. కానీ విచిత్రంగా ఈ ముగ్గురూ ఇప్పుడు కేబినెట్ లో లేరు. జగన్ పై ఈగవాలనీయరు అనే పేరున్న ఈ ముగ్గుర్నీ ఆయన పక్కనపెట్టారు. కానీ ముగ్గురూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
సైలెంట్ గా జగన్ నిర్ణయం శిరోధార్యం అంటూ బయటకొచ్చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇకపై కూడా ఆ ముగ్గురు అదే ఊపు కొనసాగిస్తారా.. ప్రతిపక్షాల తాట తీస్తారా..? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.
నాకు మంత్రి పదవి ఉంది కాబట్టి మీరు బతికిపోయారు, పదవి లేకపోతే నా నోటికి తట్టుకోలేరంటూ ఇటీవలే కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ కి వార్నింగ్ ఇచ్చారు. మరి నాని ఆ ఊపు కొనసాగిస్తే మాత్రం తండ్రీకొడుకులు తట్టుకోలేరేమో. అప్పుడంటే పదవిలో ఉండి వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు మంత్రి అనే హోదా లేదు కాబట్టి కొడాలి పవర్ అదే రేంజ్ లో ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.
పేర్ని నాని చమక్కులుంటాయా..?
చంద్రబాబు, చినబాబుని కొడాలి ఓ ఆట ఆడేసుకుంటే.. పవన్ కల్యాణ్ పై పంచ్ లు విసరడంలో పేర్ని నాని దిట్ట అనిపించుకున్నారు. జగన్ పై పవన్ ఎప్పుడు మాట తూలినా పేర్ని లైన్లోకి వచ్చేసేవారు.
చెడామడా తిట్టేసి సెటైర్లు వేసేవారు. మరి ఇప్పుడాయన మంత్రివర్గంలో లేరు, ఆయన సామాజిక వర్గం నుంచి మరికొందరు కేబినెట్ లో బెర్త్ లు దక్కించుకున్నారు. ఇకపై కూడా పేర్ని నాని ఆ ఉత్సాహం చూపిస్తారా..? అదే స్థాయిలో జగన్ కి అండగా నిలబడతారా అనేది వేచి చూడాలి.
అనిల్ ఆవేశం తగ్గుతుందా..?
అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ బయట అయినా ఆవేశంగా మాట్లాడి ప్రత్యర్థులను చిత్తు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనలో అదే ఆవేశం ఉంది, మంత్రి పదవి వచ్చాక అది కొనసాగింది.
ఇప్పుడు అనిల్ మళ్లీ జస్ట్ ఎమ్మెల్యే అయ్యారు, మాజీ మంత్రి అయిపోయారు. మరిప్పుడు ఆయనలో అదే ఆవేశం కనపడుతుందా, అనిల్ ప్రెస్ మీట్ అంటే వణికిపోయిన ప్రత్యర్థులు ఇప్పుడు రిలాక్స్ అయిపోవచ్చా.. ఈ విషయం త్వరలోనే తేలుతుంది.
మొత్తమ్మీద మంత్రులుగా ఉండి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఈ ముగ్గురు నేతలు, పదవి లేకున్నా అదే ఉత్సాహం, ఊపు చూపిస్తారా.. మంత్రుల్ని కాదని, మీడియా ముందుకొచ్చి మాట్లాడే అవకాశాన్ని జగన్ వీళ్లకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.