పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. వివాదాలు రేపేందుకు చంద్రబాబు ఓ కొత్త ధ్వంస రచనకు దిగారు. తన నాయకులపై తానే దాడులు చేయించి సరికొత్త రాజకీయాలు షురూ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి తాజా ఆరోపణలివి.
“పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి?”
ప్రస్తుతం అరెస్టై రిమాండ్ లో ఉన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై కూడా సెటైర్లు వేశారు విజయసాయి. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో, కాబోయే హోం మినిస్టర్ ను తాననేని అచ్చెన్న వాదనకు దిగడాన్ని ఎద్దేవా చేశారు విజయసాయి.
“కాబోయే హోం మినిష్టర్ అచ్చెన్నంట. క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించడానికి బిస్కెట్ వేశాడు. చంద్రబాబు చెవిలో చెప్పి ఉంటాడు. బహిరంగపరిస్తే ఎలా అచ్చెన్నా. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా తాము ఏ శాఖల మంత్రులో చెబుతారంట. పిచ్చి అందరికీ అంటించాడు బాబు.”
2024 నాటికి ఆంధ్రప్రదేశ్ ను మద్యపానరహితంగా చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగడం ఆనందంగా ఉందన్నారు విజయసాయి. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయన్నారు.