మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే భారతదేశంలో అనేక గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయనే అభిప్రాయం పలువురిలో ఉంది. మోడీ మరియు భారతీయ జనతా పార్టీకి ఉండగల ప్రత్యేకమైన ఎజెండాలోని అనేక అంశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదని.. ఒక్కటొక్కటిగా వాటిని అమలు చేస్తున్న ప్రధాని, మూడోసారి తిరిగి గద్దెనెక్కితే గనుక మిగిలి ఉన్న అజెండా అంశాలన్నింటినీ పూర్తి చేస్తారని పలువురి విశ్లేషణ.
భారతదేశంలో కుల మతాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఉమ్మడి పౌరస్మృతి (కామన్ సివిల్ కోడ్)ను అమలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ ప్రగాఢమైన విశ్వాసాలలో ఒకటి. నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇది అమల్లోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు.
ఎన్నికలకు ముందే ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ఆయన తమ ప్రచారాస్త్రం లాగా ప్రయోగిస్తున్నారు. పైగా ఈ ప్రచారానికి మంచి ఫలితాలు కూడా లభిస్తున్నాయి. ఎన్నికలు రాకముందే ఆయనకు విజయం దక్కినట్లుగా సంకేతాలు వస్తున్నాయి. మోడీని చాలా ఘాటుగా వ్యతిరేకించే విపక్ష పార్టీలు కూడా ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగా మాట్లాడడం అనేది కీలకమైన పరిణామం.
ఉమ్మడి పౌర స్మృతి అంశంపై ప్రజలను ప్రతిపక్షాల రెచ్చగొడుతున్నాయంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల భవిష్యత్తుతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయనేది ఆయన విమర్శ. అదే సమయంలో ఒక్కో మతానికి ఒక్కో రకమైన చట్టం ఉంటే ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అని మోడీ ప్రశ్నిస్తున్నారు!
ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు అమలు చేయడం సాధ్యమేనా అని ఆయన అంటున్నారు. తద్వారా మతాలు వేరైనప్పటికీ కూడా భారత దేశంలోని ప్రజలందరూ ఒకే కుటుంబం లాంటి వారనే సంకేతాలను పంపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
నరేంద్ర మోడీ ఇలాంటి ప్రయత్నాల్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ప్రకటించింది. అన్ని మతాలకు ఒకటే చట్టం ఉండాలనే ఆలోచనకు తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు ఆప్ ప్రతినిధి వెల్లడించారు. ఢిల్లీలో అధికారుల బదిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మోడీపై చాలా గట్టి పోరాటం సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ… ఉమ్మడి పౌరస్కృతి విషయంలో మాత్రం ఎలాంటి శషబిషలకు పోకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం విశేషం.
అయితే అన్ని భాగస్వామ్య పార్టీలతో సమాలోచనలు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాలని మాత్రమే వాళ్ళు అంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు- మతపరమైన అడ్డుగోడలతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే పార్టీలు ఉన్న నేపథ్యంలో.. ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశంపై ఏకాభిప్రాయం తీసుకురావడం ఒక పట్టాన జరిగే పని కాదు. కానీ ఆప్ వంటి పార్టీ మద్దతు ఇవ్వడం అనేది మోడీ సాధించిన విజయంగా, ఉమ్మడి పౌరస్మృతి అనే అంశానికి దక్కిన మద్దతుగా భావించాల్సి ఉంటుంది.