కుల సంఘాలకు భూముల కేటాయింపుపై మరోసారి తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. బలమైన కుల సంఘాలకు భూములు కేటాయించడం ఏంటని ధర్మాసనం నిలదీయడం విశేషం. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కుల రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇందులో ఏ పార్టీ మినహాయింపు కాదు. కమ్మ, వెలమ సంఘాల భవన నిర్మాణాలకు ఖానామెట్‌లో ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ 2021లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ బెంచ్ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 21వ శతాబ్దంలో కూడా కుల సంఘాలకు భూములు కేటాయించడం ఏంటని నిలదీసింది. ఇది భూకబ్జాగా అభివర్ణించింది.
ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తోందా? అని ధర్మాసనం నిలదీయడం చర్చకు దారి తీసింది. ముఖ్యంగా హైటెక్ రాష్ట్రం తెలంగాణలో కుల సంఘాలకు భూములు కేటాయించడం ఏం పద్ధతని ప్రశ్నించింది. కేవలం అణగారిన వర్గాలకే భూమి కేటాయించాలని రాజ్యాంగంలో ఉందనే విషయాన్ని గుర్తు చేసింది. అణగారిన వర్గాలకు భూములు కేటాయిస్తే అర్థం చేసుకోవచ్చని, బలమైన కులసంఘాలకు భూములు ఇవ్వడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.
కమ్మ, వెలమ సంఘాలకు కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. భూముల కేటాయింపునకు సంబంధించి జారీ చేసిన జీవో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా వుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.