తెదేపా తవ్వుతున్న గొయ్యి పెద్దదే!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేయగల స్థితిలో ఉందా?  పోటీ చేస్తే వారికి ఏమైనా సానుకూలత ఉంటుందా? అనే అనుమానం కూడా ఇక్కడి ప్రజల్లో లేదు. కానీ.. తెలుగుదేశానికి చెందిన కొందరు నాయకులకు…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేయగల స్థితిలో ఉందా?  పోటీ చేస్తే వారికి ఏమైనా సానుకూలత ఉంటుందా? అనే అనుమానం కూడా ఇక్కడి ప్రజల్లో లేదు. కానీ.. తెలుగుదేశానికి చెందిన కొందరు నాయకులకు మాత్రం పోటీచేయాలనే కోరిక ఉంది. పోటీ ద్వారా.. తమ రాజకీయ స్థాయిని కొంత పెంచుకోవాలనే తపన తప్ప.. గెలిచి ఉద్ధరిస్తామనే నమ్మకం వారికి కూడా ఉన్నట్టు లేదు. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఈ ఎన్నికల్లో పోటీచేస్తే మరింత పతనమే అనే అభిప్రాయమే పలువురిలో ఉంది. పోటీచేయడం అనేది తమ గొయ్యి తాము తవ్వుకోవడమే అని పలువురు అనుకుంటుండగా.. ప్రస్తుతం కాసాని జ్ఞానేశ్వర్ మాటలను బట్టి.. తెలుగుదేశం తమ కోసం తాము చాలా పెద్ద గొయ్యి తవ్వుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

తెలంగాణ తెలుగుదేశానికి సారథిగా కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాస్త  హడావుడి చేశారు. పార్టీ బతికి ఉందనే భాన కలిగించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణలో పోటీ వారికి భారంగా మారే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో బాలయ్యతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన గతంలో పార్టీ అన్ని స్థానాల్లో కాకుండా.. బలం ఉన్న చోట్ల మాత్రమే బరిలోకి దిగుతుందని అన్నారు. మొత్తం 85 సీట్లలో పోటీలో ఉంటామని, బాలయ్య ప్రచారం కూడా నిర్వహిస్తారని అన్నారు. అంతవరకు గుడ్డిలో మెల్ల పోటీ పేరిట ఆశపడేవారికి కాస్త తక్కువ నష్టం జరుగుతుందని అంతా అనుకున్నారు.

ఇప్పుడు కాసాని మాట మారుస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోనూ పోటీ చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. రెండు రోజుల్లో రాజమండ్రి జైలుకు వెళ్లి తాను ప్రతిపాదిస్తున్న జాబితాను చంద్రబాబుకు చూపి ఆమోద ముద్ర వేయించుకుని వస్తారట. జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే సంగతి కూడా చంద్రబాబుతో చర్చించి వస్తారట. 

నిజానికి తెలంగాణలో పోటీ గురించి పవన్ కల్యాణ్ ఇప్పటి దాకా ఏం చప్పుడు చేయడం లేదు. వారికి కూడా ఒక్క సీటైనా గెలవగల బలం లేదు. ఇద్దరూ కలిసి పోటీచేసినా కూడా.. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లుగా పరిస్థితి అవుతుందని పలువురు భావిస్తున్నారు.