కుల ఒత్తిడికి బాబు త‌లొగ్గుతారా?

తెలంగాణ‌లో నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు స‌మయం ముంచుకొస్తోంది. తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని నిన్న‌మొన్న‌టి వ‌ర‌రూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన ఆ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్వ‌రంలో చిన్న మార్పు. తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన…

తెలంగాణ‌లో నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు స‌మయం ముంచుకొస్తోంది. తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని నిన్న‌మొన్న‌టి వ‌ర‌రూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన ఆ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్వ‌రంలో చిన్న మార్పు. తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం వుందంటూనే, పోటీపై ఆయ‌న స‌న్నాయి నొక్కులు నొక్క‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై చంద్ర‌బాబునాయుడి నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని అన్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో టీడీపీ త‌ల‌ప‌డ‌డం అనుమానమే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దీనికి కార‌ణం తెలంగాణ క‌మ్మ సామాజిక వ‌ర్గం చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తోంద‌ని స‌మాచారం. టీడీపీ పోటీ చేసినా గెల‌వలేక‌పోగా, ఓట్లు చీలి కాంగ్రెస్‌కు న‌ష్ట వ‌స్తుంద‌నే అభిప్రాయంలో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు క‌ష్టాల‌కు బీఆర్ఎస్‌, బీజేపీలు కూడా కార‌ణ‌మ‌ని క‌మ్మ సామాజిక వ‌ర్గం న‌మ్ముతోంది. అందుకే ఆ రెండు పార్టీల‌కు వ్య‌తిరేకంగా రానున్న ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌ని చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం ప‌ట్టుద‌ల‌తో వుంది. ఈ క్ర‌మంలో టీడీపీ పోటీ చేయ‌క‌పోతే, కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువ అవుతుంద‌ని, త‌మ మ‌నిషిగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని బాబుకు క‌మ్మ నేత‌లు వివ‌రించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

తెలంగాణ‌లో క‌మ్మ లాబీయింగ్ చంద్ర‌బాబుపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే తెలంగాణ‌లో పోటీ చేస్తామ‌ని చెబుతూ వ‌చ్చిన కాసాని, ఇప్పుడా మాట‌ను ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నారు. దీంతో తెలంగాణ‌లో పోటీపై చంద్ర‌బాబు మ‌న‌సులో ఏదో ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఒక‌వేళ తెలంగాణ‌లో టీడీపీ పోటీ చేయ‌లేదంటే, కేవ‌లం ఆయ‌న సామాజిక వ‌ర్గం నేత‌లే ఒత్తిడి ప‌ని చేసింద‌ని అనుకోవాల్సి వుంటుంది. అదే జ‌రిగితే ఇక తెలంగాణ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గం టీడీపీకి బ‌దులు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్‌ను చూసుకున్న‌ట్టుగా భావించాల్సి వుంటుంది. రాజకీయాల్లో ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మార్పులుంటాయ‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగా పేరు. అలాంటి రెడ్ల పార్టీని త‌మ పార్టీగా క‌మ్మ సామాజిక వ‌ర్గం భావించ‌డం రాజ‌కీయ మార్పును సూచిస్తోంది.