బుల్లితెరపై కూడా మెరిసిన బంగార్రాజు

వాసీవాడి తస్సాదియ్యా అంటూ సంక్రాంతికి సందడి చేశాడు బంగార్రాజు. పెద్దగా పోటీలేకపోవడంతో సోలోగా థియేటర్లలోకొచ్చి మరోసారి సంక్రాంతి అల్లుడు అనిపించుకున్న నాగార్జున సినిమా, ఇప్పుడు బుల్లితెరపై కూడా సక్సెస్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్…

వాసీవాడి తస్సాదియ్యా అంటూ సంక్రాంతికి సందడి చేశాడు బంగార్రాజు. పెద్దగా పోటీలేకపోవడంతో సోలోగా థియేటర్లలోకొచ్చి మరోసారి సంక్రాంతి అల్లుడు అనిపించుకున్న నాగార్జున సినిమా, ఇప్పుడు బుల్లితెరపై కూడా సక్సెస్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో టెలికాస్ట్ అయిన బంగార్రాజు సినిమాకు 14 టీఆర్పీ వచ్చింది.

ఈమధ్య కాలంలో నాగార్జున నటించిన ఏ సినిమాకూ ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు. ఆఫీసర్, మన్మధుడు-2 లాంటి సినిమాలు టీవీల్లో కూడా ఫెయిల్ అయ్యాయి. ఎట్టకేలకు బంగార్రాజు సినిమాతో సిల్వర్ స్క్రీన్ తో పాటు, స్మాల్ స్క్రీన్ పై కూడా సక్సెస్ అందుకున్నాడు నాగార్జున.

నిజానికి ఇదేమంత ఘనమైన టీఆర్పీ కాదు. ఇంకా చెప్పాలంటే టాప్-10 టీఆర్పీ లిస్ట్ లోకి కూడా ఇది చేరలేదు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, బాహుబలి-2, పుష్ప, శ్రీమంతుడు లాంటి సినిమాలతో బంగార్రాజు రేటింగ్ ను పోల్చి చూడలేం. కాకపోతే కచ్చితంగా నాగ్ కు ఇది బూస్టింగ్ ఇచ్చే నంబరే.

నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన సినిమా బంగార్రాజు. కల్యాణ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆంధ్రాలో సక్సెస్ అయింది. నైజాంలో మాత్రం ఏమంత ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ను పూర్తిగా నాగచైతన్యకు ఇచ్చేశాడు నాగ్. చైతూ పూర్తిస్థాయిలో మాస్ రోల్ చేసిన సినిమా ఇదే.

ఇక బంగార్రాజుతో పాటు హీరో, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలు కూడా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా ప్రసారమయ్యాయి. అశోక్ గల్లా నటించిన హీరో సినిమాను స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేస్తే, కేవలం 2 టీఆర్పీ వచ్చింది. ఇక నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను ఈటీవీలో ప్రసారం చేస్తే, ఘోరంగా 1 టీఆర్పీ మాత్రమే రేటింగ్ వచ్చింది.