కనీసం 24 గంటలు కూడా గడవకనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట మార్చారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత తననెవరూ అవమానించడం లేదని గవర్నర్ ఢిల్లీలో చెప్పారు. ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ మండిపడుతోంది.
గవర్నర్ పూర్తిగా రాజకీయ నాయకురాలిగా విమర్శలు చేస్తోందనేందుకు ఇంత కంటే ఉదాహరణ ఏం కావాలని ఆమె మాటల్నే చూపుతుండడం గమనార్హం. గవర్నర్ మాట తీరులో నిన్న, ఇవాళ్టికి వచ్చిన మార్పేంటో తెలుసుకుందాం.
ప్రధాని మోదీని బుధవారం ఆమె కలుసుకున్నారు. ప్రధానితో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్‌భవన్‌కు మంత్రులెప్పుడైనా రావచ్చన్నారు. తననెవరూ అవమానించలేదని, తనెకలాంటి ఇగోలు లేవని ఆమె స్పష్టం చేశారు.
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను గురువారం కలిసిన తర్వాత ఆమె మీడియాతో ఏం మాట్లాడ్డారంటే….
రాజ్‌భవన్‌కు ఏ పార్టీతో సంబంధం ఉండదన్నారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్‌భవన్, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనను కాకపోయినా, గవర్నర్‌ను గౌరవించాలని హితవు పలికారు. తాను ఎవర్నీ విమర్శించడం లేదన్నారు. రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో జరుగుతున్నది మాత్రమే చెబుతున్నానన్నారు.
ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదన్నారు. సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా? అని గవర్నర్ ప్రశ్నల తీవ్రతను పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్సాతో భేటీ తర్వాతే తమిళిసై స్వరంలో తీవ్రత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.