కరోనా కొత్త వేరియంట్.. ముంబయిలో గుబులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించేలోపే కొత్త గుబులు మొదలైంది. ముంబయిలో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీంతో మీడియాతో పాటు, ప్రజలంతా మరోసారి ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించేలోపే కొత్త గుబులు మొదలైంది. ముంబయిలో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీంతో మీడియాతో పాటు, ప్రజలంతా మరోసారి ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి కొత్త వేరియంట్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులుగా అత్యంత కనిష్ట స్థాయికి కేసులు చేరాయి. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను కూడా తొలిగించారు. అంతా సాధారణ స్థితికి వస్తుందనుకున్న టైమ్ లో ముంబయిలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడింది. దీనికి ఒమిక్రాన్ ఎక్స్ఈ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం చైనాలో వేగంగా విస్తరిస్తున్న రకం ఇదే.

ముంబయిలో నిన్న మొత్తం 376 శాంపిల్స్ కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా.. అందులో ఒకరికి ఎక్స్ఈ, మరొకరికి కప్పా వేరియంట్ సోకినట్టు గుర్తించారు. వీటిలో ఎక్స్ఈ రకం, ఒమిక్రాన్ తో పోలిస్తే 10 రెట్లు వేగంగా విస్తరిస్తుందని, ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్థారించారు. అయితే ఎక్స్ఈ వేరియంట్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయ లక్షణాలు కనిపించలేదని వైద్యులు ప్రకటించారు.

ఇండియాలో ఫోర్త్ వేవ్ వస్తుందనే అంచనాలు చాన్నాళ్లుగా ఉన్నాయి. కరోనా ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. అది నాలుగో వేవ్ కు దారితీస్తుందనే విషయాన్ని మాత్రం నిపుణులు పక్కాగా చెబుతున్నారు. దానికి బీజం ముంబయిలో వెలుగుచూసిన ఎక్స్ఈ రకమే అని చాలా మంది భావిస్తున్నారు.

ఇప్పటికే ఇండియా మొత్తం సాధారణ స్థితికి వచ్చేసింది. ఎవ్వరూ మాస్కులు పెట్టుకోవడం లేదు, భౌతికదూరం పాటించడం లేదు, శానిటైజర్ వాడాలనే విషయాన్నే మరిచిపోయారు. ఇలాంటి టైమ్ లో ఎక్స్ఈ రకం విస్తరిస్తే మరోసారి దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తడం ఖాయం. కాకపోతే ఎక్స్ఈ వేరియంట్ లక్షణాలు, దాని దుష్ప్రభావాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.

ఒమిక్రాన్ తరహాలోనే ఎక్స్ఈ రకం పెద్దగా ప్రభావం చూపించదని, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని ప్రాధమికంగా అంచనాకు వచ్చారు నిపుణులు. పైగా దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతన్న వేళ.. కొత్త వేరియంట్ లు ప్రభావం చూపవని అంటున్నారు. మరికొంతమంది ఇది ప్రమాదకారికా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.