ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు లేదా సార్వత్రిక ఎన్నికల టైమ్ లో కేబినెట్ రద్దవుతుంది. అంతా రాజీనామాలు సమర్పిస్తారు. కానీ టర్మ్ మధ్యలోనే ఇలా కేబినెట్ లో 90శాతం మంత్రులు రాజీనామా చేయడం అందరికీ కొత్తగా అనిపిస్తోంది. అవును.. ఏపీ కేబినెట్ మంత్రుల్లో చాలామంది ఈరోజు రాజీనామాలు చేయబోతున్నారు. ఈ అరుదైన ఘటనకు ఈరోజు కేబినెట్ భేటీ సాక్ష్యంగా నిలవనుంది.
ఏపీ మంత్రి మండలి సమావేశం ఈరోజు అత్యంత భావోద్వేగంతో నిండిపోనుంది. మంత్రులంతా మాజీలవుతున్నారని చెప్పడానికే ఈ చివరి భేటీ. ఈ సమావేశం అనంతరం రాజీనామాలపై ప్రకటన, రాజీనామాలు, వాటి ఆమోదం ఇలా అన్నీ ఓ సీక్వెన్స్ ప్రకారం జరిగిపోతాయి. మధ్యాహ్నం 3 గంటలకు తన ఎ-టీమ్ తో జగన్, చివరి కేబినెట్ భేటీలో పాల్గొంటారు.
ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత, ఒకరిద్దరు మినహా మంత్రులంతా మాజీలవుతారు. వారి స్థానంలో ఈనెల 11న కొత్తవారు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో.. మంత్రి పదవి పోగొట్టుకున్న వారు ఎవరు, కొత్త మంత్రిమండలిలో కూడా కొనసాగబోతున్న మంత్రులు ఎవరు అనే అంశంపై సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చేస్తుందన్నమాట.
పేర్ని నాని లాంటి మంత్రులు ఒకరిద్దరు ఇప్పటికే తమ రాజీనామాలపై పరోక్షంగా స్పష్టత ఇచ్చేశారు. మంత్రిగా ఇదే తన చివరి సమావేశం అంటూ పేర్ని నాని మొన్న ప్రకటించేశారు. మిగతా మంత్రులు కూడా ఈరోజు మధ్యాహ్నానికి అధికారికంగా మంత్రి పదవుల నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించనున్నారు. నిజంగా మంత్రులకు ఇదొక భావోద్వేగ సమయం. చేతిలో ఉన్న పదవిని, టర్మ్ ముగియకముందే చేజేతులా వదులుకోవాల్సి రావడం బాధాకరమైన విషయమే. అయినప్పటికీ తప్పదు.
పనితీరు ఎలా ఉన్నా.. అధికారంలో ఉండగానే ఇలా రాజీనామాలు చేయాల్సి రావడం మంత్రులందరికీ కొత్తగానే ఉంటుంది. కానీ తప్పడంలేదు. దీనికోసం ప్రత్యేకంగా ఈరోజు భేటీ కావడం కూడా అరుదైన విషయమే. ఇప్పటికే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ప్రకటించిన సీఎం జగన్.. నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలసి మహూర్తం ఖరారు చేశారు. ఈనెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కోరారు. అదే సమయంలో మాజీలవుతున్న తాజా మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని కూడా కోరారు.
బి-టీమ్ లో ఎవరెవరు..?
గవర్నర్ తో భేటీ తర్వాతైనా జగన్ కొత్త టీమ్ ని ప్రకటిస్తారని, పోనీ ఓ కాపీని గవర్నర్ కి ఇస్తారని, అది లీకయితే విశ్లేషణలు మొదలు పెట్టాలని మీడియా కాచుకు కూర్చుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు ఆహ్వానం ఇచ్చారు కానీ, మంత్రుల జాబితాను మాత్రం బయటపెట్టలేదు జగన్.
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రోజే జాబితా బయటకు వచ్చే అవకాశముంది. లేదంటే, అంతకంటే ఒక రోజు ముందు ఆ పేర్లు తెలిసే ఛాన్స్ ఉంది.