మోక్షజ్ఞతో సినిమాకు ఒక్క రాత్రి చాలు

ఇదిగో తోక అంటే అదిగో పులి టైపులో మోక్షజ్ఞ డెబ్యూ ఏ ఏడాదికాయేడు వాయిదా పడుతూనే ఉంది. చివరికి ఈ ఏడాదిలో కూడా మోక్షు తెరపైకి రావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ…

ఇదిగో తోక అంటే అదిగో పులి టైపులో మోక్షజ్ఞ డెబ్యూ ఏ ఏడాదికాయేడు వాయిదా పడుతూనే ఉంది. చివరికి ఈ ఏడాదిలో కూడా మోక్షు తెరపైకి రావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ వెల్లడించారు. తన కొడుకు మోక్షజ్ఞ వచ్చే ఏడాది డెబ్యూ ఇస్తాడని, అతడి కెరీర్ పై తనకు ఎలాంటి టెన్షన్ లేదని, ఒక్క రాత్రి సమయం చాలని అంటున్నారు.

“మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో అనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను మెంటల్లీ అలా ప్రిపేర్ అవ్వను. ఏవీ ప్లాన్ చేయను. రేపు షూటింగ్ అంటే, ఈరోజు కథ రెడీ అయిపోతుంది. నాకు ఒక్క రాత్రి చాలు. నేను అంత స్పీడ్ గా ఉంటాను, నా స్పీడ్ ఎవ్వరూ తట్టుకోలేరు. మోక్షజ్ఞ భవిష్యత్ గురించి నాకు అస్సలు దిగులు లేదు. ఎందుకంటే, నా దగ్గరే బోలెడన్ని సబ్జెక్టులున్నాయి.”

కథలకు కొదవలేదని, ఎటొచ్చి మంచి దర్శకుడు కావాలని అన్నారు బాలయ్య. తన దర్శకత్వంలో మోక్జజ్ఞ సినిమా ఉంటుందని, కానీ ఎప్పుడో చెప్పలేనని అన్నారు.  

“మోక్షుతో మొదటి సినిమా నాదే కావొచ్చు, లేదా రెండో సినిమా ఉండొచ్చు. 'ఆదిత్య-999 మ్యాక్స్' మాత్రం రెడీగా ఉంది. ఒక్క రాత్రిలో రెడీ చేశాను ఆ కథ. అది కూడా ఆ రాత్రి నేను పడుకున్నాను, కథ ఆసువుగా వచ్చేసింది. ఇంకో కథ కూడా రెడీ చేసి పెట్టాను. ఇలా మరో 4-5 కథలున్నాయి. కాబట్టి మోక్షు ఫ్యూచర్ గురించి నాకు దిగులే లేదు. నా దగ్గర కథలున్నాయి. ఎటొచ్చి మంచి దర్శకుడు దొరకాలంతే.”

ఎన్టీఆర్ మనవడు, బాలయ్య కొడుకు అనే భారం మోక్షజ్ఞపై ఉంటుందని, అలాంటి ఒత్తిడి లేకుండా చేసి, అతడ్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని అన్నారు బాలకృష్ణ. ఒక్కసారి హీరోగా పరిచయం చేసేస్తే, ఇక వాడి సినిమాలు వాడే చేసుకుంటాడని చాలా తేలిగ్గా అనేశారు.